Sharmila Fires On YCP | వైఎస్సార్ (YSR) కుటుంబ ఆస్తుల వివాదం ఇప్పుడు వ్యక్తిగత స్థాయి నుంచి రాజకీయ రణరంగంగా మారింది. తన సోదరుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
వివేకానంద రెడ్డి హత్య కేసును పక్కదారి పట్టించేందుకే వైసీపీ నేతలు ఆస్తుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆమె మండిపడ్డారు. కాగా ఇటీవల తన తల్లి విజయమ్మ విడుదల చేసిన లేఖలోని ప్రతి అక్షరం నిజమని షర్మిల స్పష్టం చేశారు.
“నలుగురు బిడ్డలకు ఆస్తి సమానంగా పంచాలన్నది రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశం. జగన్ అన్యాయం చేస్తున్నాడని ఆ లేఖలో స్పష్టంగా ఉంది. ఆ సంతకం తల్లిది కాదని ప్రచారం చేస్తున్న వైసీపీ ‘సైతాన్ సైన్యం’.. దమ్ముంటే జగన్ చేత ఆ మాట చెప్పించాలి” అని సవాల్ విసిరారు.
తాను ఆస్తుల కోసం పాకులాడటం లేదని, ఒకవేళ అదే తన ఉద్దేశ్యం అయితే తెలంగాణలో పార్టీ పెట్టేదాన్నే కాదని గుర్తు చేశారు. జగన్ తన తల్లిపైనే కోర్టులో కేసు వేయడం వల్లే ఎంఓయూ పత్రాలు బయటకు వచ్చాయని వివరించారు.






