YS Jagan Letter to PM Modi over Delimitation | కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేపట్టబోయే డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖను రాశారు.
జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాల్లో లోకసభ, రాజ్యసభ సీట్లు గణనీయంగా తగ్గుతాయనే ఆందోళన నెలకొందని లేఖలో జగన్ ప్రస్తావించారు. కేంద్రప్రభుత్వ జనాభా నియంత్రణ పిలుపు మేరకు దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలు చేపట్టిన చర్యల మూలంగా గత 15 ఏళ్లలో జనాభా బాగా తగ్గిందని, ఈ నేపథ్యంలో ఇప్పుడున్న జనాభా ఆధారంగా పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుందని జగన్ స్పష్టం చేశారు.
ఈ క్రమంలో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చెప్పట్టకుండా చూడాలని సూచించారు. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం ఉండేలా చూడాలన్నారు. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గకుండా డిలిమిటేషన్ ప్రక్రియ నిర్వహించాలన్నారు. లోకసభ, రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా రాబోయే నియోజకవర్గ పునర్విభజన కసరత్తు నిర్వహించాలని లేఖలో జగన్ కోరారు.