Saturday 11th April 2026
12:07:03 PM
Home > క్రైమ్ > వాటర్ బిల్లు కట్టలేదని ఫోన్ వస్తే జాగ్రత్త.. సజ్జనర్ హెచ్చరిక!

వాటర్ బిల్లు కట్టలేదని ఫోన్ వస్తే జాగ్రత్త.. సజ్జనర్ హెచ్చరిక!

cyber scammer

Hyderabad Water Bill Scam | సిటీలో సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసానికి తెరలేపారు. ఈసారి ‘వాటర్ బోర్డు’ అధికారుల పేరుతో నగరవాసులను బురిడీ కొట్టిస్తున్నారు.

నీటి బిల్లులు బకాయి ఉన్నాయంటూ ఫోన్ చేసి, క్షణాల్లో బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ నగర ప్రజలను అప్రమత్తం చేశారు.

“మీ నీటి బిల్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. వెంటనే చెల్లించకపోతే మీ కనెక్షన్ కట్ చేస్తాం” అని ఫోన్ చేసి భయపెడతారు. బిల్లు అప్‌డేట్ చేయాలంటూ ‘HMWSSB WATER BILL UPDATE.apk’ అనే ఫైల్ ఉన్న లింక్‌ను వాట్సాప్ లేదా ఎస్సెమ్మెస్ ద్వారా పంపిస్తారు.

పొరపాటున ఆ ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేస్తే, మీ మొబైల్ నియంత్రణ మొత్తం కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. వారు మీ స్క్రీన్‌ను గమనిస్తూ, బ్యాంక్ ఓటీపీలను (OTP) తస్కరించి డబ్బులు కాజేస్తారు. అంతేకాదు, మీకు వచ్చే కాల్స్‌ను కూడా వారు డైవర్ట్ చేస్తారు.

పోలీసుల సూచనలు..

  1. తెలియని వ్యక్తులు పంపే ఎటువంటి ఫైళ్లను లేదా లింక్‌లను పొరపాటున కూడా క్లిక్ చేయవద్దు, ఇన్‌స్టాల్ చేయవద్దు.
  2. నీటి బిల్లులను కేవలం HMWSSB అధికారిక వెబ్‌సైట్ లేదా వారి అధికారిక మొబైల్ యాప్ ద్వారానే చెల్లించండి.
  3. ఎవరైనా అధికారులమని ఫోన్ చేసి బెదిరిస్తే భయపడకుండా, నేరుగా సమీపంలోని వాటర్ బోర్డు కార్యాలయాన్ని సంప్రదించండి.
  4. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వండి.

నగరవాసులు అప్రమత్తంగా ఉండి తమ కష్టార్జితాన్ని సైబర్ దొంగల పాలు కాకుండా చూసుకోవాలని సీపీ సజ్జనర్ కోరారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions