Woman Grabs Rohit Sharma’s Hand to Plead Help for her Child | టీం ఇండియా ప్లేయర్ రోహిత్ శర్మ వద్దకు ఓ మహిళ దూసుకువచ్చి తన కుమార్తెను రక్షించాలని వేడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇటీవల ఇండియా-న్యూజిలాండ్ మధ్య మధ్యప్రదేశ్ ఇందౌర్ వేదికగా మూడవ వన్డే మ్యాచ్ జరిగింది. టీం ఇండియా ఆటగాళ్లు హోటల్ కు వెళ్తున్న సమయంలో భద్రతా వైఫల్యం వెలుగులోకి వచ్చింది. టీం ఇండియా హెడ్ కోచ్ గంభీర్, రోహిత్ శర్మ మరియు ఇతర ఆటగాళ్లు హోటల్ లోనికి వెళ్తున్నారు. ఇదే సమయంలో ఓ మహిళ భద్రతా వలయాన్ని ఛేదించి రోహిత్ వద్దకు దూసుకువచ్చింది. తన కుమార్తె ప్రాణాలను కాపాడాలని ఆమె ప్రాధేయపడింది. అయితే సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు.
ఈ ఘటనపై సదరు మహిళ వివరణ ఇచ్చారు. తాను సెల్ఫీల కోసం ఇలా చేయలేదన్నారు. తన పేరు సరితా శర్మ, తన కుమార్తె అనిక అని పేర్కొన్నారు. కుమార్తె భయంకరమైన, అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. పాపను రక్షించుకోవాలంటే రూ.9 కోట్ల విలువైన ఇంజక్షన్ అవసరం అని, అది అమెరికా నుండి రావాలన్నారు. ఇప్పటి వరకు రూ.4 కోట్లు సేకరించినట్లు తెలిపారు. సమయం తక్కువగా ఉండడం మూలంగా టీం ఇండియా ప్లేయర్లను సహాయం చేయాలని కోరడం కోసమే అలా చేసినట్లు పేర్కొన్నారు.









