Woman cop directs traffic on highway with child in arms | చంకన బిడ్డతో ట్రాఫిక్ ను క్లియర్ చేశారు ఓ మహిళా కానిస్టేబుల్. కాకినాడ-సామర్లకోట రోడ్డులో శనివారం సాయంత్రం భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కాకినాడ వైపు వెళ్తున్న ఓ లారీ రోడ్డు మధ్యలోనే సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. దింతో ఆ వెనకే ఉన్న వాహనాలు ముందుకు పోలేకపోయాయి. నిమిషాల వ్యవధిలోనే వందల సంఖ్యలో వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. దింతో సుమారు 5 కి.మీ. మేర వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇందులో రెండు అంబులెన్సులు కూడా చిక్కుకున్నాయి.
మరోవైపు రంగంపేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జయకు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కాకినాడలో బందోబస్తుకు వెళ్లారు. ఈ సమయంలో తన బిడ్డను కాకినాడలోని బంధువుల ఇంట్లో ఉంచి వెళ్లారు. విధులు ముగించుకుని చంటిబిడ్డతో స్వగ్రామానికి వెళ్తున్న జయ రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో రంగంలోకి దిగారు. చంకన చంటిబిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్సులను ముందుగా పంపించారు. ఇతర పోలీసు అధికారులతో కలిసి జయ ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.









