Widow Cheated of ₹28 Crore by Second Husband | జీవిత చరమాంకంలో తోడుగా ఉంటాడని ఓ మహిళ ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే భర్త అని మహిళ నమ్మగా, రూ.28 కోట్లకు టోకరా వేశాడు ఆ ఘనుడు.
వివరాల్లోకి వెళ్తే..చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేటకి చెందిన నాగమణికి 1992లో వివాహం జరిగింది. అయితే 15 ఏళ్ల క్రితం తనయుడు ప్రమాదంలో మృతి చెందగా 10 ఏళ్ల క్రితం భర్త చనిపోయాడు. వయసు మీద పడుతుండడం, తనకు తన ఆస్తికి భద్రతతో పాటు తోడు కోసం పెళ్లి చేసుకోవాలని ఆమె భావించింది.
ఈ నేపథ్యంలో జామున అనే పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా బంగారుపాళ్యం మండలం శేషాపురానికి చెందిన శివప్రసాద్ ను కలిసింది. తనకు పిల్లలు లేరని, భార్య కరోనా సమయంలో మృతిచెందినట్లు ఒక నకిలీ డెత్ సెర్టిఫికెట్ ను కూడా అతడు చూపించాడు. దింతో అతని మాటలు నమ్మిన నాగమణి 2022లో శివప్రసాద్ ను పెళ్లి చేసుకుంది.
కొన్నిరోజుల పాటు అంతా సవ్యంగానే సాగింది. ఆ తర్వాత తనకు ఆర్బీఐ నుండి రూ.1700 కోట్లు రావాలని ఇందుకోసం కొన్ని డబ్బులు కావాలని శివప్రసాద్ నమ్మబలికాడు. భర్త మాటలు నమ్మిన నాగమణి తన వ్యవసాయ భూమి, బెంగళూరులో ఉన్న ప్లాట్ మరియు కొంత నగదు మొత్తం కలిపి రూ.28 కోట్లను శివప్రసాద్ కు ఇచ్చింది.
కొన్నిరోజుల తర్వాత ఆర్బీఐ డబ్బుల విషయంలో నిలదీయగా అతడు గతేడాది డిసెంబర్ లో ఇంటినుంచి పారిపోయాడు. శివప్రసాద్ ను వెతుక్కుంటూ నాగమణి శేషాపురానికి వెళ్ళింది. అక్కడ అతడు తన భార్య, పిల్లలతో ఉండడం చూసి షాక్ కు గురయ్యింది. నాగమణిని చూసిన శివప్రసాద్ ఇంటి నుంచి కూడా పారిపోయాడు. ఈ నేపథ్యంలో నాగమణి చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేసింది.