Viral News | పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే పెద్దలు కూడా బయపడుతారు. కానీ ఓ పదేళ్ల బాలుడు తనకు జరిగిన మోసం పై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం ఆసక్తిగా మారింది.
ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని కంగ్టి మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే వినయ్ రెడ్డి అనే 10 ఏళ్ల బాలుడు జాతర కోసం కంగ్టిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. తాతతో కలిసి జాతరకు వెళ్ళాడు. అక్కడ రూ.300 పెట్టి ఓ బొమ్మ హెలికాప్టర్ ను కొన్నాడు.
ఇంటికి వచ్చి చూడగా అది గాల్లోకి ఎగరడం లేదు. వెంటనే జాతరలో ఏర్పాటు చేసిన దుకాణం వద్దకు వెళ్లగా యజమాని మరో హెలికాప్టర్ ఇచ్చాడు. రెండవది కూడా పనిచేయడం లేదని మరోసారి దుకాణం వెళ్లగా యజమాని తిరిగి వేరే హెలికాప్టర్ ఇచ్చాడు. ఇది కూడా ఎగరడం లేదని, మళ్లీ షాపుకు వెళ్లగా యజమాని కోపడ్డాడు. వేరే హెలికాప్టర్ ఇచ్చేది లేదని తెగేసిచెప్పాడు.
తాను మోసానికి గురయ్యాయని తెలిసిన పదేళ్ల బాలుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. షాపు యజమాని చేసిన మోసాన్ని పోలీసులకు వివరించాడు. స్పందించిన ఎస్ఐ జాతరకు ఒక కానిస్టేబుల్ ను పంపారు. కానీ అప్పటికే దుకాణం యజమాని జాతర నుండి వెళ్ళిపోయాడు.
ఈ తరుణంలో బాలుడి తాతను పోలీస్ స్టేషన్ కు పిలిపించిన ఎస్ఐ బాలుడికి సర్ది చెప్పి అక్కడి నుండి పంపించారు. కాగా పదేళ్ల బాలుడి ధైర్యం గురించి తెలుసుకున్న వారు అభినందిస్తున్నారు.









