Vijaya Dairy Letter To TTD | కలియుగ దైవం శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి అంశం తీవ్ర వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థాన ( TTD ) బోర్డుకు తెలంగాణ విజయ డెయిరీ ఆఫర్ ఇచ్చింది.
తిరుమల దేవస్థానంలో ప్రసాదం, ఇతర అవసరాల కోసం స్వచ్ఛమైన నెయ్యిని, పాల ఉత్పత్తులను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు విజయ డెయిరీ ప్రకటించింది.
ఈ మేరకు టీటీడీ ఈవో జె.శ్యామలరావుకు తెలంగాణ పశు సంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సబ్య సాచి ఘోష్ శనివారం లేఖను రాశారు. పాల ఉత్పత్తుల రంగంలో తెలంగాణ విజయ డెయిరీకి మంచి పేరు, చరిత్ర ఉందని లేఖలో ఘోష్ రాశారు.
విజయ డెయిరీ ( Vijaya Dairy ) ప్రభుత్వ సంస్థ అయినందున పాల ఉత్పత్తుల్లో స్వచ్ఛత, నాణ్యత, ధరల విషయంలో పూర్తి పారదర్శకంగా ఉంటుందని వెల్లడించారు. దేవస్థానానికి, భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించాలని టీటీడీని విజయ డెయిరీ కోరింది.
తిరుమల స్వామి వారికి సమర్పించే నైవేద్యాల కోసం స్వచ్ఛమైన పాల ఉత్పత్తులు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు విజయ డెయిరీ స్పష్టం చేసింది.