Vice President Jagdeep Dhankhar on Monday evening resigned from his post | ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ ఖడ్ సోమవారం రాత్రి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
సోమవారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఉదయం రాజ్యసభ ఛైర్మన్ హోదాలో చురుకుగా కనిపించిన ధన్ ఖడ్ రాత్రికి అనారోగ్య కారణాలతో రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ముర్ముకు పంపించారు.
2022 ఆగస్ట్ 11న ఉప రాష్ట్రపతిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 2027 ఆగస్టు వరకు ఆయన పదవీ కాలం ఉంది. అయితే రెండేళ్ల పదవీకాలం ఉన్నా ఆయన రాజీనామా చేయడం పట్ల ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఉప రాష్ట్రపతి పదవికి ధన్ ఖడ్ రాజీనామా చేయడంతో జేడీయూ నేత డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ రాజ్యసభ సమావేశాలను నడిపించనున్నారు.
వైద్యుల సూచన మేరకే ఆరోగ్యానికి ప్రధాన్యమిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 (ఎ) కు లోబడి ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పదవీకాలంలో తనకు మద్దతుగా నిలిచిన రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, మంత్రి మండలికి ధన్ ఖడ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో తదుపరి ఉప రాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకుంటారనే ఆసక్తి నెలకొంది.









