Venezuela’s Machado gives Trump her Nobel Peace Prize | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి పురస్కారాన్ని బహుకరించారు వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కోరినా మచాదో. వెనెజువెలాలో నియంతృత్వానికి వ్యతిరేకంగా, ప్రజల హక్కుల కోసం మచాదో పోరాటం చేస్తున్నారని పేర్కొన్న నోబెల్ కమిటీ గతేడాది ఆమెకు నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే తనకు నోబెల్ బహుమతి దక్కకపోవడం పట్ల అప్పట్లోనే ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ట్రంప్ కు తనకు దక్కిన నోబెల్ పురస్కారాన్ని బహుమతిగా అందించబోతున్నట్లు మచాదో ప్రకటించారు.
ఈ నేపథ్యంలో గురువారం వాషింగ్టన్ లోని వైట్ హౌస్ లో తొలిసారి ట్రంప్-మచాదో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నోబెల్ శాంతి పురస్కార మెడల్ ను ట్రంప్ కు బహుకరించారు. వెనెజువెలా దేశ ప్రజల స్వేచ్ఛ కోసం ట్రంప్ చూపిన ప్రత్యేక నిబద్ధతకు గుర్తింపుగా పురస్కారాన్ని బహుకరించినట్లు ఆమె మీడియాకు చెప్పారు. ఈ క్రమంలో స్పందించిన ట్రంప్ మచాదో గొప్ప మహిళ అని ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై నార్వేజియన్ నోబెల్ కమిటీ స్పందిస్తూ..పురస్కారాన్ని ఇతరులకు బదిలీ, పంచుకోవడం లేదా రద్దు చేయడం కుదరదు అని స్పష్టం చేసింది.









