USA Student Visa Conditions | అమెరికా (America)లో ఉన్నత విద్య అభ్యసించడం కోసం విదేశీ విద్యార్థుల వీసా (USA Student Visa) దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించినట్లు ట్రంప్ సర్కార్ ప్రకటించింది. ఆసక్తి ఉన్నస్టూడెంట్స్ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే తాజాగా ఒక కండీషన్ విధించింది అమెరికా ప్రభుత్వం.
స్టూడెంట్స్ ఎందుకోసం దరఖాస్తు పెట్టుకున్నారో దానికే ఆ వీసాను వాడుకోవాలని స్పష్టం చేసింది. ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చి చదువును వదిలేయడం, క్యాంపస్ లను ధ్వంసం చేయడం లాంటివి చేయకూడదని విదేశాంగ శాఖ ప్రతినిధి మిగ్నాన్ హౌస్టన్ హెచ్చరించారు.
తమ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఉంటుందని స్పష్టం చేశారు. వలస చట్టాల ఆధారంగా ఈ పాలసీలను నిర్ణయిస్తామనీ, అమెరికా ఇమిగ్రేషన్ అత్యున్నత ప్రమాణాలతో ఉండేలా చూస్తామని తెలిపారు.
ఇవి కేవలం తమ పౌరులను రక్షించడానికే మాత్రమే కాదు వారితోపాటు చదువుకొనే ఇతర విద్యార్థులను కాపాడటానికి కూడా అవసరమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అమెరికా వెళ్లే విద్యార్థులు తమ సోషల్ మీడియా ఖాతాలకు పబ్లిక్ వ్యూ ఆప్షన్ ను యాక్టివేట్ చేయాలని గతంలోనే సూచించిన విషయం తెలిసిందే.