Union Minister Nithin Gadkari | దేశ రాజధానిలో ఢిల్లీ (Delhi) నగరం పరిస్థితిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nithin Gadkari) కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉండటంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఢిల్లీలో మూడ్రోజులుంటే అనారోగ్యానికి గురవడం ఖాయమని వ్యాఖ్యానించారు.
కాలుష్యం విషయంలో ఢిల్లీ, ముంబై రెండు నగరాలు రెడ్ జోన్లో ఉన్నాయని తెలిపారు. దిల్లీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే అక్కడి ప్రజల సగటు ఆయుర్దాయం 10 ఏళ్లు తగ్గుతుందని అంచనా వేసిన ఓ వైద్య పరిశోధనను ఉటంకించారు మంత్రి నితిన్ గడ్కరీ. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని సూచించారు.
పర్యావరణాన్ని కూడా ముఖ్యమైన విషయాల్లో ఒకటిగా పరిగణించాలని సూచించారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి రహదారుల మౌలిక సదుపాయాల కల్పన కూడా ఓ పరిష్కారంగా పని చేస్తుందని గడ్కరీ అభిప్రాయపడ్డారు.
పెట్రోల్, డీజిల్ కాలుష్యానికి ప్రధాన కారణాలు కాబట్టి వాహనాల్లో ఉపయోగించే ఇంధనంలో మార్పు అవసరమని పేర్కొన్నారు. దాదాపు రూ.22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్నామని.. వాటికి ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించాల్సిన సమయం వచ్చిందన్నారు.