- వివాహంతో ఒక్కటి కానున్న నేరస్తులు!
Marriage Made in Jail | నేర కథలు, ప్రేమ కథలు వేర్వేరు అనుకుంటాం. కానీ కొన్నిసార్లు అవే ఒకే కథగా మలుచుకుని ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు మాత్రమే పరిమితమవుతాయనుకున్న కథలు నిజ జీవితంలోనూ జరుగుతాయనడానికి రాజస్థాన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన తాజా ఉదాహరణ.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రెండు భయానక హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు జైలులోనే ప్రేమలో పడి, పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ఈ అసాధారణ జైలు ప్రేమకథలో ప్రియురాలు 31 ఏళ్ల ప్రియా సేథ్ (Priya Seth).
2023లో జైపూర్‌లో జరిగిన టిండర్–సూట్‌కేస్ హత్య కేసు అప్పట్లో దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యాపారవేత్త దుష్యంత్ శర్మను కిడ్నాప్ చేసి, డబ్బు కోసం హత్య చేసిన కేసులో ప్రియా సేథ్ జీవిత ఖైదు అనుభవిస్తోంది.
మరోవైపు ప్రియుడు 29 ఏళ్ల హనుమాన్ ప్రసాద్. 2017లో అల్వార్‌లో ఒక వ్యక్తి, అతని ముగ్గురు కుమారులు, మేనల్లుడిని హత్య చేసిన కేసులో అతనూ జీవిత ఖైదు శిక్ష పొందాడు. ఈ హత్యలు అతని వివాహేతర సంబంధం కారణంగా జరిగినట్లు కోర్టు నిర్ధారించింది.
జైపూర్ సెంట్రల్ జైలు నుంచి సాంగానేర్ ఓపెన్ జైలుకు మారిన తర్వాత వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఓపెన్ జైలులో ఖైదీలకు పగటిపూట బయట పని చేసే అవకాశం ఉండటంతో, ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారిందని అధికారులు చెబుతున్నారు. సుమారు ఏడాది కాలంగా వారు సంబంధంలో ఉన్నట్లు సమాచారం.
రాజస్థాన్ హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా పెరోల్ సలహా కమిటీ ఇద్దరికీ 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఈ సమయంలో అల్వార్ జిల్లాలోని వరుడి స్వగ్రామంలో వివాహం జరగనుంది. అయితే ఈ నిర్ణయంపై బాధితుల కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పెరోల్ ఉత్తర్వులను సవాలు చేస్తామని, హైకోర్టును ఆశ్రయిస్తామని బాధితుల తరపు న్యాయవాదులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, జైలు అధికారులు మాత్రం నిబంధనల ప్రకారమే అన్ని చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. నేర చరిత్రలతో కూడిన ఈ జైలు ప్రేమకథ ఇప్పుడు ఒక ఓటీటీ వెబ్ సిరీస్ డ్రామా లాగా వార్తల్లో నిలిచింది.





