Trump slaps 25% tariff on imports from India | భారత దేశంపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. భారత్ మిత్ర దేశం అంటూనే అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకం తో పాటు జరిమానా సైతం విధించనున్నట్లు వెల్లడించడం సంచలనంగా మారింది.
మిత్ర దేశం అయినప్పటికీ భారత్ తో వాణిజ్యం తక్కువగా జరుగుతుందని దీనికి ప్రధాన కారణం న్యూ ఢిల్లీ విధిస్తున్న అధిక సుంకాలు అని ట్రంప్ ఆరోపించారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటన్నారు.
రష్యా-భారత్ మధ్య ఉన్న మైత్రి, వాణిజ్య సంబంధాలపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు. రష్యా నుంచి భారత్ రక్షణ రంగ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. అలాగే రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్, చైనా ఉన్నాయని తెలిపారు.
ఈ కారణాల మూలంగా భారత్ పై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. సుంకాలతో పాటు జరిమానా సైతం విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. రష్యా నుంచి దిగుమతుల కారణంగా పెనాల్టీలకు గురైన తొలి దేశం భారత్ కావడం గమనార్హం.









