– మండలిలో టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన సవాల్!
TPCC Mahesh Goud | తెలంగాణ శాసనమండలి వేదికగా డ్రగ్స్ వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడితనానికి గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనే కారణమని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
డ్రగ్ టెస్టుల విషయంలో ఆయన ప్రతిపక్ష నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రకమైన పరీక్షకైనా సిద్ధంగా ఉన్నారు. మరి కేసీఆర్, కేటీఆర్ ముందుకు వస్తారా? మీరు అంగీకరిస్తే రేపే ముహూర్తం పెడదాం, సీఎంను ఒప్పించే బాధ్యత నాది” అని మహేశ్ గౌడ్ సవాల్ విసిరారు.
ప్రజాప్రతినిధులందరూ పరీక్షలు చేయించుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు. కాంగ్రెస్ నుండి బీ-ఫామ్స్ తీసుకున్న వారందరినీ తాము టెస్టులకు తీసుకువస్తామని, బీఆర్ఎస్ కూడా అదే ధైర్యం చూపాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ తీరుపై విమర్శలు
మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో మాజీ ఎమ్మెల్యే పట్టుబడటంపై స్పందిస్తూ.. డ్రగ్స్ కేసుల్లో ఎప్పుడూ బీఆర్ఎస్ నాయకుల పేర్లే ఎందుకు వస్తున్నాయని నిలదీశారు. గతంలో టెస్టులంటే భయపడి పారిపోయిన వారు ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం ‘ఈగల్ టీమ్’ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి మాదకద్రవ్యాల సరఫరాను అరికడుతున్నారని పేర్కొన్నారు. పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ నోటీసులు ఇచ్చిన వేళ, మండలిలో ఈ ‘డ్రగ్ ఛాలెంజ్’ రాజకీయాల్లో చిచ్చు రేపుతోంది.






