Actress Teena Sravya | ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క–సారలమ్మ (Medaram Jathara) మహాజాతరలో టాలీవుడ్ హీరోయిన్ టీనా శ్రావ్య (Actress Teena Sravya) వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసింది.
మేడారంలో భక్తులు తమ బరువుకు సమానంగా బెల్లం తూకం వేసి అమ్మవార్లకు సమర్పించే తులాభారం సంప్రదాయం ఉంది.
ఈ క్రమంలో టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కకు తులాభారం వేసి బెల్లం సమర్పించడంతో వివాదం చెలరేగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు తీవ్రంగా స్పందించారు.
ఇది సంప్రదాయాలకు విరుద్ధమని, భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని మండిపడ్డారు. వివాదం పెద్దదవడంతో టీనా శ్రావ్య వీడియో ద్వారా క్షమాపణ చెప్పారు.
తన పెంపుడు కుక్క అనారోగ్యంతో బాధపడిందని, అది కోలుకోవాలని భక్తితో అమ్మవారికి మొక్కుకున్నానని తెలిపారు.
తన కుక్క ఆరోగ్యం మెరుగవడంతో అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నాని చెప్పారు. భక్తితో, ప్రేమతో చేశానని, ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తనకు లేదన్నారు.
మేడారం సంప్రదాయాల ప్రకారం ఇది తప్పని తెలిసిందని అంగీకరిస్తూ, ఎవరి మనసు నొప్పించినా సారీ అంటూ ఇకపై ఇలాంటి తప్పులు చేయబోనని వివరించారు.









