Three arrested for poisoning tigers in revenge for cow’s killing | కర్ణాటక రాష్ట్రంలో ఘోరం జరిగింది. తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఆవును పులి వేటాడి చంపేసిందని ఓ వ్యక్తి క్రూరమృగాలను చంపాలని ప్లాన్ వేశాడు.
ఈ క్రమంలో ఐదు పులులకు విషం పెట్టి చంపేశాడు. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు-కేరళ సరిహద్దు చామరాజనగర్‌లోని ఎం.ఎం. హిల్స్ సంరక్షణ కేంద్రంలో ఐదు పులులు , ఒక తల్లి పులి మరియు నాలుగు కునాలు అనుమానాస్పదంగా మరణించాయి.
వెంటనే రంగంలోకి దిగిన అటవీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. విషం కారణంగానే అవి మరణించాయని నిర్ధారణకు వచ్చారు. దర్యాప్తు ముమ్మరం చేయగా మాదురాజు అనే వ్యక్తి మరో ఇద్దరి సహాయంతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు గుర్తించారు.
మాదిరాజు ఎంతో అపురూపంగా ‘కెంచి’ అనే ఆవును పెంచుకున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం ఆవును పులి వెంటాడి చంపేసింది. ఎలాగైనా తన ఆవును చంపిన పులిపై ప్రతీకారం తీర్చుకోవాలని సదరు వ్యక్తి భావించాడు. స్నేహితులు కోనప్ప, నాగరాజు సహాయంతో ఆవు కళేబరంపై విషం చల్లి దానిని పులులు సంచరించే ప్రాంతంలో పడేశారు.
కాగా విషం చల్లిన ఆవు కళేబరాన్ని తిన్న ఒక తల్లి పులి, దాని నాలుగు కునాలు మృతి చెందాయి. ఈ నేపథ్యంలో అధికారులు మాదిరాజు మరియు అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.