Sunday 8th September 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తెలుగు రాష్ట్రాల్లోకి వందేభారత్ ఎక్స్ ప్రెస్.. ఈ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే!

తెలుగు రాష్ట్రాల్లోకి వందేభారత్ ఎక్స్ ప్రెస్.. ఈ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే!

Vande Bharat Train Features | ఇండియాస్ ఫస్ట్ సెమీ బుల్లెట్ ట్రైన్ గా పేరొందిన వందేభారత్ (Vande Bharat) రైలు తెలుగు రాష్ట్రాల్లోనూ అడుగుపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య పరుగులు పెట్టడానికి సిద్ధం అయింది.

సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆదివారం (జనవరి 15న) ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

సాధారణంగా ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం స్టేషన్లలో మాత్రమే ఆగనుంది. అయితే తొలిరోజు కాబట్టి సోమవారం మొత్తం 21 స్టేషనల్లో వందేభారత్ ఆగుతుంది.

విశాఖ నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడంతోపాటు అత్యంత సౌకర్యవంతమైన జర్నీని అందిస్తోంది వందేభారత్ ఎక్స్ ప్రెస్.

ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో నడుస్తున్న వందే భారత్ ట్రైన్లలో కెల్లా అత్యధిక దూరం ప్రయాణించే రైలు కూడా ఇదే.

Read Also: పటేలోళ్ల శెల్కల పతంగులు ఎగరేసేటోళ్లం.. ఓ ఎన్ఆర్ఐ సంక్రాంతి జ్ఞాపకాలు!

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవీ..

  • వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రపంచ స్థాయి అనుభూతిని అందించే అద్భుతమైన సౌకర్యాలతో పూర్తిగా భారత్ లోనే తయారైనా కొత్త సాంకేతికతతో నడిచే రైలు.
  • వందే భారత్‌ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయి. ఇందులో 14 ఏసీ చైర్‌ కార్లు. రెండు బోగీలు ఎగ్జిక్యూటివ్‌ ఏసీ కార్‌ కోచ్‌లు ఉన్నాయి.
  • ఎగ్జిక్యూటివ్‌ ఏసీ కార్‌ కోచ్‌లో 104 సీట్లు ఉంటాయి. ఇక ఎకానమీ క్లాస్‌లో 1,024 సీట్లు ఉంటాయి. మొత్తంగా ఈ రైలులో 1,128 మంది ప్రయాణం చేయొచ్చు.
  • రెగ్యులర్ బుకింగ్ కింద 806 సీట్లు, తత్కాల్ బుకింగ్ కింద 322 సీట్లు కేటాయించారు. ఇక ఈ రైలుకు ఆటోమేటిక్‌ తలుపులుంటాయి. వాటి నియంత్రణ లోకో పైలట్‌ దగ్గర ఉంటుంది.
  • కోచ్‌లో 32 అంగుళాల డిజిటల్‌ స్క్రీన్‌ ఉంటుంది. ఇందులో రైలు వేగంతో సహా అన్ని వివరాలు డిస్‌ప్లే అవుతాయి. ట్రైన్ లోపల, బయట సీసీటీవీ కెమెరాలు ఉంటాయి.
  • ఎదురుగా రైలొస్తే ఢీ కొట్టకుండా కవచ్‌ టెక్నాలజీ ఉంది. ప్రతి కోచ్‌లో 4 ఎమర్జెన్సీ లైట్లు ఏర్పాటు చేశారు.
  • కేవలం 140 సెకన్లలో గరిష్ట వేగాన్ని అందుకోగల కెపాసిటీ ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ఉంది.
  • ఈ రైలులో బోగీలను ఫుల్లీ సస్పెండెడ్‌ ట్రాక్షన్‌ మోటార్‌తో రూపొందించారు. దీంతో రైలు ఎంత వేగంగా వెళ్లినా కుదుపులు ఉండవు.
  • వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ భారతదేశపు మొదటి ఇంజన్ లేని రైలు. ఇప్పటి వరకు, మన దేశంలోని రైళ్లకు ప్రత్యేక ఇంజన్ కోచ్ ఉండగా, ఈ ట్రైన్ లో బుల్లెట్ లేదా మెట్రో రైలులాంటి ఏకీకృత ఇంజిన్ ఉంది.
  • కంప్యూటరైజ్డ్ ఏరోడైనమిక్ డ్రైవర్ క్యాబిన్ ఉంటుంది. ప్రయాణీకులు డ్రైవర్ క్యాబిన్ ను పూర్తిగా చూసే విధంగా ఈ రైలు రూపొందించబడింది.
  • ప్రతి కోచ్‌లో సామాన్ భద్రపరచుకోవడానికి మాడ్యులర్ రాక్‌లు ఉన్నాయి. ఇవి గతిమాన్ ఎక్స్‌ ప్రెస్ లాంటి ఇతర రైళ్ల కంటే విశాలంగా ఉంటాయి.
  • రైలు ప్యాంట్రీలో ఆహారం, పానీయాలను వేడి చేయడానికి లేదా చల్లబరచడానికి మెరుగైన నాణ్యత గల పరికరాలు ఉంటాయి.  
  • మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌ను సులభంగా ఛార్జ్ చేయడానికి కోచ్‌లలో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే సాకెట్లు ఉన్నాయి. ఈ సాకెట్లు అనుకూలమైన స్థానంలో సీటు కింద అమర్చబడి ఉంటాయి.
  • కోచ్‌ల మధ్య ఖాళీలు పూర్తిగా మూసివేయబడతాయి. ఇది బాహ్య శబ్దాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
  • రైలు కోచ్‌లలో టచ్ కంట్రోల్‌తో కూడిన రీడింగ్ లైట్లు ఇస్తారు. ట్రైన్‌ లోపల వైఫై సౌకర్యం కూడా ఉంది.
  • వందేభారత్ ఎక్స్ ప్రెస్ టికెట్ రేట్లో క్యాటెరింగ్ ఛార్జెస్ కూడా కలిపి ఉంటాయి. ఒకవేళ ప్రయాణికులు ఆహారం వద్దనుకుంటే మాత్రం ఆ మేరకు టికెట్ రేట్లు తగ్గుతాయి.
  • దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏడు వందేభారత్ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్‌ నుంచి  విశాఖకు నడిచే రైలు ఎనిమిదవది. 
  • సికింద్రాబాద్‌-విశాఖ నగరాల మధ్య దూరం 698 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు ఈ దూరం చేరడానికి సుమారు 12 గంటలకుపైన సమయం పడుతుంది. కానీ వందే భారత్ ట్రైన్‌కు కేవలం 8 గంట‌ల 40 నిమిషాల్లోనే గమ్యానికి చేరుకుంటుంది.
  • ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయితే సికింద్రాబాద్‌– విశాఖ మధ్య వేగ పరిమితి 130 కి.మీ. మాత్రమే ఉంది.

వందే భారత్ టికెట్ రేట్లు ఇవీ..

విశాఖ నుంచి..  

  1. విశాఖ నుంచి విజయవాడ వరకు:
    ఛైర్ కార్ – రూ.960,
    ఎగ్జిక్యూటివ్ క్లాస్ – రూ.1825  
  2. విశాఖ నుంచి ఖమ్మం వరకు:
    ఛైర్ కార్ – రూ. 1115
    ఎగ్జిక్యూటివ్ క్లాస్ – రూ. 2130
  3. విశాఖ నుంచి వరంగల్ వరకు:
    ఛైర్ కార్ – రూ.1310,
    ఎగ్జిక్యూటివ్ క్లాస్ – రూ.2540
  4. విశాఖ నుంచి సికింద్రాబాద్:
    ఛైర్ కార్ – రూ.1720
    ఎగ్జిక్యూటివ్ క్లాస్ – రూ. 3170

సికింద్రాబాద్ నుంచి..

  1. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు
    ఛైర్ కార్ – రూ.520
    ఎగ్జిక్యూటివ్ క్లాస్ – రూ.1005
  2. సికింద్రాబాద్ – ఖమ్మం
    ఛైర్ కార్ – రూ.750
    ఎగ్జిక్యూటివ్ క్లాస్ – రూ.1460
  3. సికింద్రాబాద్ – విజయవాడ
    ఛైర్ కార్ – రూ.905,
    ఎగ్జిక్యూటివ్ క్లాస్ – రూ.1775
  4. సికింద్రాబాద్ – రాజమండ్రి
    ఛైర్ కార్ – రూ.1365
    ఎగ్జిక్యూటివ్ క్లాస్ – రూ.2485
  5. సికింద్రాబాద్ – విశాఖ
    ఛైర్ కార్ – రూ.1665,
    ఎగ్జిక్యూటివ్ క్లాస్ – రూ.3120

తెలుగు రాష్ట్రాల్లో నడిచే వందే భారత్ ట్రైన్ టైమింగ్స్ ఇవే..

విశాఖ నుంచి..

విశాఖ నగరం నుంచి ఉదయం 5.45కు రైలు బయలుదేరుతుంది. ఉదయం 7.55 గంటలకు రాజమండ్రికి, 10 గంటలకు విజయవాడకు, 11 గంటలకల్లా ఖమ్మం వరకు చేరుకుటుంది. మధ్యాహ్నం 12.05 గంటలకు వరంగల్ కు, 2.15 కల్లా సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటుంది.

సికింద్రాబాద్ నుంచి..

సికింద్రాబాద్‌ స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. 4.35 గంటలకు వరంగల్ కు, 5.45 గంటలకల్లా ఖమ్మం వరకు చేరుకుటుంది. సాయంత్రం 7 గంటలకు విజయవాడకు, రాత్రి 8.50 నిమిషాలకు గంటలకు రాజమండ్రికి, రాత్రి 11.30 గంటల వరకు విశాఖపట్నం స్టేషన్ కు రీచ్ అవుతుంది.

You may also like
secunderabad - tirupati vande bharat express
తిరుమలకు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీకో శుభవార్త!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions