TVK Vijay Holographic AI campaign | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, అగ్ర నేతలంతా నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు.
అయితే, టీవీకే (TVK) అధినేత దళపతి విజయ్ మాత్రం ఒకే సమయంలో పలు చోట్ల ప్రచారం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలైన టెక్నాలజీ మ్యాజిక్.
తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రంలో ప్రతీ ఊరికి వెళ్లడం సమయాభావం వల్ల సాధ్యం కాదని భావించిన టీవీకే అభ్యర్థులు, విజయ్ కి ఉన్న క్రేజ్‌ను వాడుకునేందుకు ‘హోలోగ్రాఫిక్ ఏఐ’ (Holographic AI) టెక్నాలజీని రంగంలోకి దింపారు.
కుంభకోణం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో విజయ్ స్వయంగా వచ్చి మాట్లాడుతున్నట్లే కనిపించారు. ఇది కేవలం వీడియో స్క్రీన్ కాదు.. ఆయన త్రీ-డీ (3D) రూపంలో నేరుగా స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నట్లు జనం మధ్యలో ప్రత్యక్షమయ్యారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆయన గొంతును, హావభావాలను కచ్చితంగా ప్రతిబింబించేలా ఈ హోలోగ్రామ్‌ను రూపొందించారు. దీంతో విజయ్ తన నియోజకవర్గానికి రాలేదన్న వెలితి లేకుండా అభ్యర్థి తన ప్రచారాన్ని విజయవంతంగా ముగించారు.
స్టేజీపై విజయ్ త్రీ-డీ రూపం మాట్లాడుతుంటే, ప్రజలు ఈలలు, కేకలతో హోరెత్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
దేశంలో ఇంతకుముందు కొందరు నేతలు ఈ టెక్నాలజీని వాడినా, విజయ్ స్థాయిలో ఇంత ప్రభావవంతంగా ‘ఏఐ’ని వాడటం ఇదే ప్రథమమని టెక్ నిపుణులు చెబుతున్నారు.
సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ (VFX)లో ఆరితేరిన విజయ్, ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే టెక్నాలజీతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ డిజిటల్ వ్యూహం ఏప్రిల్ 23న జరిగే ఎన్నికల్లో టీవీకేకు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి.








