Thackeray brothers reunite after 20 years | మహారాష్ట్ర పై ఎవరూ త్రిభాష సూత్రాన్ని రుద్దలేరని తేల్చి చెప్పారు ఠాక్రే సోదరులు.
ఇటీవల మహారాష్ట్రలోని ఎన్డీయే ప్రభుత్వం త్రిభాష సూత్రాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో త్రిభాష విధానం అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో ఇది తమ విజయమని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ఇందులో భాగంగా శనివారం ముంబయి వేదికగా ‘ది వాయిస్ ఆఫ్ మరాఠీ’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం వేదికగా సుమారు 20 ఏళ్ల తర్వాత సోదరులు అయిన శివసేన-యూబీటి అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన వ్యవస్థాపకులు రాజ్ ఠాక్రే ఒకే వేదికను పంచుకున్నారు.
మహారాష్ట్ర ఐక్యత కోసం, మరాఠీ భాష కోసం తాము ఒక్కటిగానే ఉంటామని స్పష్టం చేశారు. 2005లో ఈ ఇద్దరు సోదరులు విడిపోయిన విషయం తెల్సిందే.
ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవడం ద్వారా విద్యార్థులు సరైన విషయాలు నేర్చుకోలేకపోతున్నారని కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. తమకు హిందీ భాష పై ఎప్పుడూ వ్యతిరేకత లేదని, కానీ బలవంతంగా హిందీని రుద్దాలని చుస్తే మాత్రం ఊరుకునేదే లేదని హెచ్చరించారు.









