CM Revanth Reddy Brand | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువారం రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల (Manchirevula) గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలో నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (Young India Police School) ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రతి నాయకుడికి ఒక బ్రాండ్ ఉందని, తన బ్రాండ్ గురించి తరచూ పలువురు అడుగుతున్నారని చెప్పారు. కిలో బియ్యం రెండు రూపాయలకే ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ ది, ఐటీని అధివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుది, ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ ది అయితే అలాగే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనేది తన బ్రాండ్ అని చెప్పుకొచ్చారు.
పోలీస్ స్కూల్ అంటే అందరికీ తానే గుర్తొస్తానని తెలిపారు. ఇదే నా బ్రాండ్ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో కొందరు తెలంగాణ ఉద్యమాన్ని తమ బ్రాండ్ గా చెప్పుకొని పైశాచిక ఆనందం పొందుతున్నారని వ్యాఖ్యానించారు.
అప్లికేషన్లు కూడా నింపలేకపోతున్నారు..
రాష్ట్రంలో విద్యావ్యవస్థపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏటా లక్షలాది మంది బీటెక్ పూర్తి చేస్తున్న విద్యార్థుల్లో నాణ్యత ఎంతంటే ఎవరి దగ్గరా సమాధానం లేదన్నారు. బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు కనీసం అప్లికేషన్లు కూడా నింపలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం.
అందుకే విద్యార్థుల్లో స్కిల్స్ పెంచాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ తీసుకొస్తున్నామని అన్నారు. సైనిక్ స్కూల్స్ తరహాలో పోలీస్ స్కూల్స్ నిర్మిస్తామని ప్రకటించారు. దేశానికే రోల్ మోడల్ గా ఉండేలా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పోలీస్ స్కూల్ అంటేనే ఓ బ్రాండ్ గా తయారు కావాలని అభిలషించారు.