Temba Bavuma Breaks Silence On ‘Bauna’ Jibe | సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా ఎత్తును ఉద్దేశిస్తూ టీం ఇండియా ఆటగాళ్లు బుమ్రా-రిషబ్ పంత్ చేసిన మరగుజ్జు వ్యాఖ్యలు వివాదంగా మారాయి. తాజగా దీనిపై బావుమా స్పందించారు. ఆ ఇద్దరు ఆటగాళ్లు మైదానంలోనే తనకు క్షమాపణలు చెప్పారని పేర్కొన్నారు. ఇటీవలే టీం ఇండియా-సౌత్ ఆఫ్రికా మధ్య రెండు టెస్టు మ్యాచుల సిరీస్ జరిగింది. ఇందులో సఫారీ జట్టు రెండింట్లో గెలిచి సత్తా చాటింది. అయితే కోల్కత్త వేదికగా జరిగిన తొలి టెస్టులో ఎల్బీడబ్ల్యూ రివ్యూ తీసుకునే సమయంలో బావుమా హైట్ ను ఉద్దేశిస్తూ బుమ్రా-పంత్ మరగుజ్జు అని కామెంట్స్ చేశారు.
అప్పట్లో ఈ వ్యాఖ్యలపై బావుమా స్పందించలేదు. కానీ తాజాగా రియాక్ట్ అయ్యారు. ‘ ఆటగాళ్లు తమ భాషలో నా గురించి ఏదో మాట్లాడారని నాకు అర్ధం అయ్యింది. కానీ దాని అర్ధం అప్పుడు తెలియలేదు. ఆ రోజు ముగిసే సమయానికి ఇద్దరు ఆటగాళ్లు రిషబ్ పంత్ మరియు జస్ప్రీత్ బుమ్రా వచ్చి క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత మా మీడియా మేనేజర్‌ను ఏం కామెంట్ చేశారు అని అడిగి తెలుసుకున్నా. మైదానంలో ఏమి జరిగినా అక్కడే వదిలేయాలి. కానీ చేసిన మాటల్ని ఎప్పటికీ మరచిపోకూడదు. వాటినే ఇంధనంగా ఉపయోగించుకుని కసితో పోరాడాలి. కానీ ఎలాంటి శత్రుత్వం పెట్టుకోకూడదు’ అని బావుమా పేర్కొన్నారు.









