Telangana News | ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కు బహుకరించిన భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రం లేకపోవడం వివాదంగా మారింది.
ఇటీవలే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ‘భారత సాంస్కృతిక వైభవం’ పేరిట భారతదేశ చిత్ర పటాన్ని మాధవ్, లోకేశ్ అందించారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో బీఆరెస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్పందించారు. మాధవ్ భారతీయ సాంస్కృతిక వైభవం పేరిట నారా లోకేష్ కు ఇచ్చిన చిత్రపటంలో తెలంగాణ మ్యాప్ లేకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇది రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు.
చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారని, తెలంగాణ లేని చిత్రపటాన్ని బీజేపీ నేత ఇవ్వడం టీడీపీ నేత తీసుకోవడం నరనరాల్లో వారికి తెలంగాణ అంటే ఇష్టం లేని తీరును సూచిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ లేని చిత్రపటం ఇవ్వడం అంటే.. తెలంగాణ అస్ధిత్వంపై దాడిగానే భావించాలని పేర్కొన్నారు.