Breath Analyzer Test | మద్యం మత్తులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం జరిపే డ్రంకెన్ డ్రైవ్ (Drunken Drive) టెస్టులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
బ్రీత్ ఎనలైజర్ టెస్టు (Breath Analyzer Test) లో మద్యం తాగినట్టు తేలినంత మాత్రాన దానిని తుది నిర్ధారణగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
కేవలం ఈ ఒక్క పరీక్ష ఆధారంగానే ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం చెల్లదని బుధవారం కీలక తీర్పు వెలువరించింది. బ్రీత్ టెస్ట్ ఫలితాలను నిర్ధారించేందుకు తప్పనిసరిగా రక్త, మూత్ర పరీక్షలు కూడా నిర్వహించాలని తేల్చి చెప్పింది.
ఇటీవల ఖమ్మం జిల్లా మధిర డిపోలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి, మద్యం తాగి డిపో వద్ద నిరసనలో పాల్గొన్నారని ఆరోపిస్తూ టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అతడిని విధుల నుంచి తొలగించింది.
బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో అతడికి 329 ఎంజీ రీడింగ్ నమోదైందని, ఇది మద్యం తాగినట్టు చెప్పడానికి శాస్త్రీయ ఆధారమని ఆర్టీసీ తరఫు న్యాయవాది వాదించారు. అందుకే క్రమశిక్షణ చర్యలు సరైనవేనని సమర్థించుకున్నారు. అయితే, ఈ వాదనను హైకోర్టు ఖండించింది.
రక్త, మూత్ర పరీక్షల వంటి నిర్ధారణ పరీక్షలు లేకుండా కేవలం బ్రీత్ ఎనలైజర్ నివేదిక ఆధారంగా మద్యం తాగినట్టు రుజువు చేయలేమని న్యాయమూర్తి జస్టిస్ జస్టిస్ నమవరపు రాజేశ్వర్ రావు వ్యాఖ్యానించారు.
కేవలం శ్వాస పరీక్ష నివేదికను ఆధారం చేసుకుని పిటిషనర్‌ను ఉద్యోగం నుంచి తొలగించడం నిలవదని కోర్టు పేర్కొన్నారు. బ్రీత్ ఎనలైజర్ నివేదికలు కేవలం ప్రాథమిక ఆధారంగా మాత్రమే ఉపయోగపడతాయని, తదుపరి వైద్య పరీక్షలకు మార్గం సుగమం చేస్తాయని స్పష్టం చేసింది.









