Telangana Government Clarity On Hyderabad Central University Lands Issue | రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో 400 ఎకరాల భూమిని వేలం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
TGIIC-తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా ప్రభుత్వం 400 ఎకరాల భూమిని వేలం వేయాలని తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని యూనివర్సిటీ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు.
అలాగే బీఆరెస్, బీజేపీ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం వేలం వేయలనుకుంటున్న భూములను ఆనుకుని వివిధ రకాల వృక్ష జాతులు, వలస పక్షులు, నెమల్లు, నక్షత్ర తాబేళ్లు, జింకలు, అడవి పందులు వంటి వైవిధ్యభరితమైన జీవజాతులు ఉన్నాయని, భూములు వేలం వేస్తే పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రాంతం హైదరాబాద్ కు ‘గ్రీన్ లంగ్స్’ గా పనిచేస్తుందన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంస్థ TGIIC స్పందించింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. భూమి యజమాని తామే అని కోర్టు ద్వారా నిరూపించుకుందని పేర్కొంది.
ఇందులో ఒక్క ఇంచు కూడా యూనివర్సిటీ భూములు లేవని సంస్థ తెలిపింది. ఇది అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని, విద్యార్థులను కొన్ని రాజకీయ పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయంది. అలాగే ఇందులో బఫెల్లో లేక్, పీకాక్ లేక్ లేవంది.