Telangana government announces sports policy | గ్లోబల్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మరియు ఐపీఎల్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల యజమానులు సంజీవ్ గోయెంకా, కావ్య మారన్ కు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర నూతన స్పోర్ట్స్ పాలసీని శనివారం ప్రకటించిన విషయం తెల్సిందే. ఇందులో భాగంగా ప్రైవేట్- పబ్లిక్- పార్ట్ నర్ షిప్ కు ప్రభుత్వం పెద్దపీట వేసింది. క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ అత్యుత్తమ ఫలితాలను అందిస్తున్న కార్పొరేట్ సంస్థలు, ఆ రంగంలో విశేష అనుభవం ఉన్న వారిని ఆహ్వానించే ఒక బోర్డును ఏర్పాటు చేసింది.
స్పోర్ట్స్ హబ్ కోసం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన జీవోను విడుదల చేసింది. మాజీ క్రీడాకారులు, క్రీడారంగంలో రాణిస్తోన్న పలువురు పారిశ్రామికవేత్తలకు బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ లో చోటు లభించింది.
ఈ బోర్డుకు సంజీవ్ గోయెంకా ఛైర్మన్ ఎంపికయ్యారు. అలాగే ఉపాసన వైస్ ఛైర్మన్ గా నియమితులయ్యారు. కపిల్ దేవ్, పుల్లెల గోపిచంద్, కావ్య మారన్, విటా దాని, సీ శశిధర్, అభినవ్ బింద్రా, బైచుంగ్ బుతియా, రవికాంత్ రెడ్డి, బియ్యాల పాపారావు, ఇంజేటి శ్రీనివాస్ లను బోర్డు సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఈ బోర్డు తెలంగాణ క్రీడా రంగాన్ని తీర్చిదిద్దడానికి కృషి చేయాల్సి ఉంటుంది.









