Thursday 29th January 2026
12:07:03 PM
Home > తాజా > దేశానికే రోల్‌మోడ‌ల్‌గా తెలంగాణ డిజాస్ట‌ర్ మేనేజిమెంట్‌!

దేశానికే రోల్‌మోడ‌ల్‌గా తెలంగాణ డిజాస్ట‌ర్ మేనేజిమెంట్‌!

ponguleti srinivasa reddy

  • రూ.100 కోట్ల‌తో అత్యాధునిక ప‌రిక‌రాలు
  • రాష్ట్ర స్ధాయిలో అత్యుత్త‌మ శిక్ష‌ణా కేంద్రం
  • క్షేత్ర‌స్ధాయి వ‌ర‌కు అడ్వాన్సుడ్ వెద‌ర్ స్టేష‌న్లు ఏర్పాటు
  • రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

Telangana Disaster Management | ప్రకృతి విపత్తులను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొని వీలైనంత‌వ‌ర‌కూ ప్రాణ న‌ష్టం, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌కుండా రాష్ట్రంలో ప్ర‌కృతి విప‌త్తుల నిర్వ‌హ‌ణా సంస్ధ (డిజాస్ట‌ర్ మేనేజిమెంట్‌) విభాగాన్ని బ‌లోపేతం చేసి దేశానికి ఒక రోల్ మోడ‌ల్‌గా ఉండేలా తీర్చిదిద్దుతున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. 

ఎటువంటి విప‌త్తుల‌నైనా ఎదుర్కొనేలా వంద కోట్ల రూపాయిల‌తో అత్యాధునిక ప‌రిక‌రాల‌ను కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు వెల్ల‌డించారు. ఇందుకు సంబంధించి బుధ‌వారం నాడు స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో  విప‌త్తుల నిర్వ‌హ‌ణా విభాగం, ఫైర్ స‌ర్వీసెస్‌, ఎస్‌డిఆర్ఎఫ్‌, హైడ్రా, ఐ సిసిసి విభాగాల‌తో స‌మావేశం నిర్వ‌హించి ఎలాంటి ప‌రిక‌రాల‌ను కొనుగోలు చేయాల‌న్న విష‌యంపై సుదీర్ఘంగా చ‌ర్చించారు.

వరదలు, అగ్నిప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో త్వరితగ‌తిన స్పందించ‌డానికి  ఖచ్చితమైన సమాచార వ్యవస్థ, రియల్‌టైమ్ మానిటరింగ్ సాధ్యమయ్యేలా విపత్తు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, డ్రోన్లు, శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్, ఆధునిక రెస్క్యూ పరికరాలు, అత్యాధునిక ఫైర్ & సెర్చ్ ఆపరేషన్ల సాంకేతికతను రెవెన్యూ–విపత్తు నిర్వహణ విభాగాలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు.

విపత్తు విభాగంలో ప‌నిచేసేవారికి శిక్ష‌ణ ఇవ్వ‌డానికి రాష్ట్ర స్ధాయిలో డిజాస్ట‌ర్ మేనేజిమెంట్ ఆధ్వ‌ర్యంలో అత్యుత్త‌మ శిక్ష‌ణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. అలాగే వాతావ‌ర‌ణ ప‌రిస్ధితులు క్షేత్ర‌స్ధాయి వ‌ర‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేలా ఆయా స్ధానిక ప‌రిస్దితుల‌ను బ‌ట్టి మండ‌ల స్ధాయి వ‌ర‌కు అడ్వాన్సుడ్ వెద‌ర్ స్టేష‌న్లు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు.

భారీ వ‌ర్షాలు  వ‌ర‌ద‌ల స‌మ‌యంలో వాగుల్లో వంక‌ల్లో చెరువుల్లో చిక్కుకున్న‌వారిని ర‌క్షించ‌డానికి ఎయిర్‌లిఫ్ట్ మెకానిజం త‌యారు చేసుకోవాల‌ని ప్ర‌మాదాల్లో చిక్కుకున్న వారిని త‌ర‌లించడానికి  70 నుంచి 80  కిలోల బ‌రువును  ఎత్తే  డ్రోన్ల‌ను కొనుగోలు చేయాల‌ని సూచించారు. 

ఎయిర్ లిఫ్ట్ వ్య‌వ‌స్ధ స‌రిగాలేక‌పోవ‌డం వ‌ల్ల 2024 సంవ‌త్స‌రంలో నా పాలేరు నియోజ‌వ‌క‌ర్గంలో వాగుల్లో చిక్కుకున్న బాధితుల‌ను ర‌క్షించుకోలేక‌పోయాన‌ని ఈ సంద‌ర్భంగా మంత్రిగారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

హైద‌రాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నుంచి రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా మాట్లాడ‌డానికి వీలుగా సిమ్ ఆధారిత విహెచ్ ఎఫ్ రేడియో సిస్ట‌మ్స్ అందుబాటులోకి తేవాల‌ని సూచించారు. ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌స్ధ అందుబాటులో ఉంది.

ఈ వ్య‌వ‌స్ద‌ను క్షేత్ర‌స్ధాయి వ‌ర‌కు తీసుకువెళ్లాల‌ని సూచించారు. అలాగే హైద‌రాబాద్ న‌గ‌రంలో హైరైజ్డ్ భ‌వ‌నాల‌లో అగ్ని ప్ర‌మాదాలు సంభ‌వించిన‌ప్పుడు వాటిని స‌మ‌ర్దవంతంగా ఎదుర్కొనేలా అవ‌స‌ర‌మైన ప‌రిక‌రాల‌ను కొనుగోలు చేయాల‌ని హైడ్రా క‌మీష‌న‌ర్‌కు సూచించారు.

77 హైస్పీడ్ బోట్‌ల‌ను కొనుగోలు చేయాల‌ని సూచించారు. రాష్ట్రంలో 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయ‌ని, ఒక్కో బృందంలో వెయ్యిమంది వ‌ర‌కు ఉన్నార‌ని వీరంద‌రికీ ఎప్ప‌టిక‌ప్పుడు శిక్ష‌ణ ఇవ్వాల‌ని సూచించారు.  

ఈ స‌మావేశంలో రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి అరవింద్ కుమార్‌,  అగ్పిమాప‌క‌శాఖ డైరెక్ట‌ర్ విక్ర‌మాన్ సింగ్‌, హైడ్రా క‌మీష‌న‌ర్ రంగ‌నాధ్‌, ఐసిసిసి డైరెక్ట‌ర్ క‌మ‌ల్‌హాస‌న్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

You may also like
harish rao pressemeet
రైతుల నోట్లో మట్టి కొట్టి.. బీరు ఫ్యాక్టరీలకు నీళ్లిస్తారా?
cm revanth about medaram jathara
‘మేడారం తల్లుల స్పూర్తితో ప్రభుత్వం ఏర్పడింది’
komatireddy venkat reddy
‘బొట్టుగూడ పాఠశాల నిర్మాణం నా చిరకాల కోరిక’
kalvakuntla kavitha
‘కేసీఆర్ సమాచారాన్ని రేవంత్ కు చేరవేసే గూఢచారి ఆయనే’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions