Telangana Cabinet Expansion | తెలంగాణ కేబినెట్ విస్తరణకు లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రాష్ట్ర మంత్రివర్గలో ముగ్గురు కొత్త మంత్రులు చేరారు. ఈ కేబినెట్ విస్తరణ ద్వారా సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని భావించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఒక బీసీ, ఇద్దరు ఎస్సీ నేతలకు మంత్రి పదవులు కట్టబెట్టింది.
అదనంగా డోర్నకల్ ఎమ్మెల్యే జె రాంచందర్ నాయక్ (J Ramchandar Naik) తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా నియమితులవుతారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కర్తాల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ (Vakiti Srihari Mudiraj), ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ (Gaddam Vivek), ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Lakshman Kumar) లకు కేబినెట్ లో చోటు కల్పించారు.
ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ ఈ ముగ్గురు కొత్త నేతలతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర సీనియర్ నాయకులు హజరయ్యారు.









