Telangana BJP News | భారతీయ జనతా పార్టీ అధిష్టానం మిషన్ తెలంగాణను చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.
ఆ వెంటనే సెప్టెంబర్ 10, 11 న తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు నేతృత్వంలో రాష్ట్ర నాయకులతో ఢిల్లీలో బీజేపీ అగ్ర నాయకులు భేటీ కానున్నారు. దక్షిణాదిన తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు ఆ పార్టీ భావిస్తున్న తరుణంలో ఆ దిశగా అధిష్టానం పావులు కదిపేందుకు సిద్ధమయ్యింది.
ఓ వైపు రాష్ట్రంలోని బీఆరెస్ బలహీనపడుతుందని అలాగే అధికార కాంగ్రెస్ పై కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు బీజేపీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ విస్తరణకు ఇదే సరైన సమయం అని భావిస్తుంది. ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ, మరోవైపు కవిత అంశాన్ని అనుకూలంగా వాడుకుని గులాబీ పార్టీని వెనక్కు నెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాషాయ పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అలాగే బీఆరెస్ లో ప్రజాబలం ఉన్న నాయకుల్ని చేర్చుకోవాలని చూస్తున్నట్లు కథనాల సారాంశం. ఇతర పార్టీల నుంచి నాయకులని చేర్చుకోవడమే కాకుండా వారితో సమన్వయానికి ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధమయినట్లు సమాచారం.









