Telangana begins exporting rice to the Philippines | తెలంగాణ రాష్ట్రం నుండి ఫిలిప్పీన్స్ దేశానికి బియ్యం ఎగుమతి ప్రక్రియ సోమవారం మొదలయ్యింది.
తొలి విడతగా 12500 టన్నుల బియ్యాన్ని ఫిలిప్పీన్స్ దేశానికి తరలిస్తున్న నౌకను కాకినాడ సీపోర్టులో జెండా ఊపి ప్రారంభించారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొత్తం 8 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
ఎంటీయూ 1010 రకం బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎగుమతి చేయనుంది. కాకినాడ పోర్టుకు వెళ్లిన మంత్రి ఉత్తమ్ ఎగుమతి తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణలో 280 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుందని, రాష్ట్ర రేషన్, ఇతర అవసరాలు తీరిన అనంతరం మిగిలిన బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నట్లు మీడియాకు మంత్రి వివరించారు.
ఫిలిప్పీన్స్ తో 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేసేందుకు ఒప్పందం కుదిరిందని, ఇందులో భాగంగా తొలి విడతగా 12500 టన్నుల బియ్యాన్ని పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర దేశాలకు కూడా బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు.