TDP Activist Chebrolu Kiran Arrested | ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) సతీమణి వైఎస్ భారతి (YS Bharati)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ (Chebrolu Kiran)పై ఆ పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అతనిపై కేసు పెట్టి అరెస్టు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో పోలీసులు కిరణ్‌పై కేసు నమోదు చేశారు.
సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విజయవాడలోని ఇబ్రహీంపట్నం వద్ద అతడు ఉన్నట్టు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ ను మంగళగిరి పీఎస్ కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశ పెడతామని అధికారులు తెలియజేశారు.
మరోవైపు క్షణికావేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశానని తనను క్షమించాలని కిరణ్ కోరారు. “నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించమని కోరుతున్నాను. ఎలాంటి ఉద్దేశంతో తాను ఈ వ్యాఖ్యలు చేయలేదు. క్షణికావేశంలో చేశాను. క్షమించండి” అంటూ వీడియో విడుదల చేశారు.
ఈ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయనీ, రాజకీయ సంస్కృతికి తగని విధంగా ఉన్నాయని వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కిరణ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వైసీపీ నేత వల్లభనేని వంశీ, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భవనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటన కూడా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.