Monday 13th April 2026
12:07:03 PM
Home > తాజా > మెగా-నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహం.. ఎట్టకేలకు సారీ చెప్పిన అనుదీప్!

మెగా-నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహం.. ఎట్టకేలకు సారీ చెప్పిన అనుదీప్!

Anudeep apologizes to Pawan Kalyan Fans | సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు, అభిమానుల తీవ్ర నిరసనల నేపథ్యంలో స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.

హైదరాబాద్‌లోని ఒక కామెడీ క్లబ్‌లో జరిగిన షోలో రాజకీయ, సినీ ప్రముఖులపై ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలు పెను వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌లోని ‘ది స్ట్రీట్ కామెడీ క్లబ్’లో జరిగిన ఒక ప్రదర్శనలో అనుదీప్ హద్దులు దాటి ప్రవర్తించారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నిహారిక కొణిదెల వ్యక్తిగత జీవితాలను ఉద్దేశించి అభ్యంతరకరమైన పదజాలంతో ఆయన జోకులు వేశారు.

నందమూరి బాలకృష్ణ మరియు మంత్రి నారా లోకేశ్ బాడీ లాంగ్వేజ్‌ను హేళన చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో మెగా, నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా యుద్ధం ప్రకటించారు.

తాజాగా పెద్ద ఎత్తున అభిమానులు ‘ది స్ట్రీట్ కామెడీ క్లబ్’ వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. కమెడియన్ అనుదీప్‌తో పాటు సదరు క్లబ్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఒత్తిడి ప్రభావం నగరం లోని ఇతర కామెడీ క్లబ్బుల నిర్వహణపై కూడా పడింది.

క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల..

పరిస్థితి తీవ్రతను గమనించిన అనుదీప్, సోషల్ మీడియాలో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. “నా ప్రదర్శనలో ఎవరినీ వ్యక్తిగతంగా కించపరచాలనే ఉద్దేశ్యం నాకు లేదు.

తెలియక చేసిన వ్యాఖ్యల వల్ల అభిమానుల మనోభావాలు దెబ్బతింటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను” అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతానని హామీ ఇచ్చారు.

కామెడీ పేరుతో ఇతరుల వ్యక్తిగత జీవితాలపై బురద జల్లడం సరైన పద్ధతి కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనతోనైనా స్టాండప్ కామెడీ రంగంలో ఒక హుందాతనం వస్తుందని ఆశిద్దాం.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions