Chain Snatching In Hyderabad | హైదరాబాద్ నగర వాసులూ.. మీరు ఒంటరిగా వెళుతున్నారా.. తెల్లవారు జామున కావొచ్చు.. మిట్ట మధ్యాహ్నం కావొచ్చు లేదా రాత్రి పూట.. రోడ్డుపై నడిచేటప్పుడు జాగ్రత్త.
ముఖ్యంగా మహిళలు.. అందులోనూ ఒంటిపై బంగారం వేసుకున్న వారు మరింత జాగ్రత్తగా ఉండండి. లేదంటే చైన్ స్నాచర్లకు చిక్కే ప్రమాదం ఉంది.

ఎందుకంటే హైదరాబాద్ లో శనివారం తెల్లవారుజామున చైన్ స్నాచర్లు భయాందోళనలు సృష్టించారు.
కేవలం రెండు గంటల వ్యవధిలో నగరంలో ఆరు చోట్ల స్నాచింగ్‌లకు పాల్పడిన ఘటనలు నమోదయ్యాయి. ఒక్క ఉప్పల్ పరిధిలోనే 2 చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు దుండగులు.
(Chain Snatching In Hyderabad) ఉప్పల్ మాస్టర్ చెఫ్ సమీపంలో స్నాచర్లు మహిళ మెడలో నుంచి బంగారం చైన్ లాక్కెళ్లారు.
అనంతరం ఉప్పల్ కళ్యాణపురిలో ఉదయం వాకింగ్ కు వెళుతున్న సమయంలో మహిళ మెడలోని పుస్తెలతాడును దొంగిలించారు.
Read Also: Hyderabad నగరానికి ఎల్లో అలర్ట్.. రానున్న రెండ్రోజులు జాగ్రత్త!
అనంతరం నాచారంలోని నాగేంద్రనగర్, ఓయూ పరిసరాల్లోని రవీంద్రనగర్, చిలకలగూడ రామాలయం వీధి, రాంగోపాల్ పేట్ పరిధిలో దుండగులు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు.
ఉప్పల్ నుంచి మొదలై హబ్సీగూడ మీదుగా సికింద్రాబాద్ వరకూ ఈ చైన్ స్నాచింగ్‌లు చేస్తూ వచ్చారు. రెండు గంటల వ్యవధిలో ప్రతి 20 నిమిషాలకు ఒక స్నాచింగ్ చేశారు.
ఈ నేరాలకు సంబంధించిన ముఠాలను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
ఢిల్లీ గ్యాంగ్‌గా అనుమానిస్తున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్ ఈ స్నాచింగ్స్ చేసినట్టు అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు.
Also Read: హెలికాప్టర్ లో సాంకేతిక లోపం.. బాలయ్యకు తప్పిన పెను ప్రమాదం!
దుండగులు వెంటనే రైలు లేదా విమానంలో పారిపోయే అవకాశం ఉందనే అనుమానంతో నగరాన్ని జల్లెడ పడుతున్నారు.
రైల్వే స్టేషన్లలో, ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తర రాష్ట్రాలు మరియు విమానాశ్రయం వైపు రైళ్లు వెళ్లే ప్లాట్‌ఫారమ్‌ల వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
చైన్ స్నాచర్ల కోసం 12 బృందాల గాలింపు చర్యలు చేపట్టాయి. నగరంలో వరుస స్నాచింగ్‌లపై మిగతా పోలీస్ స్టేషన్లకూ హై అలర్ట్ చేశారు.