Thursday 21st November 2024
12:07:03 PM
Home > ఇతర విభాగాలు > Kartika Poornima: కార్తీక పౌర్ణమి – విశిష్టత!

Kartika Poornima: కార్తీక పౌర్ణమి – విశిష్టత!

kartika purnima significance

Kartika Poornima | సనాతన హిందూ సంప్రదాయంలో ముఖ్యంగా తెలుగు సంస్కృతిలో కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. అభిషేక ప్రియుడైన మహా శివుడికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. దీపావళి తర్వాత శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసం అంతా శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరుస్తాయి.

శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతాయి. దీపావళి సందర్భంగా కేదారేశ్వర వ్రతాలు జరుపుకోవడం సంప్రదాయం. దీపావళి అనంతరం కూడా ముఖ్య తిథుల్లో సత్యనారాయణ వ్రతాలు, కేదారేశ్వర నోములు జరుపుకొంటారు. కార్తీక మాసంలో దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నెలంతా సాయంకాలం శివాలయంలో, ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు.

కార్తీక పౌర్ణమి..

కార్తీక మాసంలో పౌర్ణమిని మరింత పావనమైన తిథిగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి శివ, కేశవులు ఇద్దరీకి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా హిందూ పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమిని శరత్ పూర్ణిమ, త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కార్తీకేయుడు జన్మించిన కృత్తికా నక్షత్రంలోనే కార్తీక పౌర్ణమి వస్తుంది.

వేదాలను హరించి సముద్ర  గర్భంలో దాక్కున్న సోమకాసురుణ్ని వరించడానికి శ్రీ మహా విష్ణువు మత్స్యావతారం దాల్చింది ఈ పర్వదినమే. కార్తీక పౌర్ణమిని దేవ దీపావళిగా కూడా జరుపుకొంటారు. హిందూ పురాణాల ప్రకారం సకల దేవతలు కార్తీక పూర్ణిమ రోజున దీపావళిని జరుపుకుంటారు.

అందుకే ఈ రోజుని దేవ దీపావళి అంటారు. కార్తీక పౌర్ణమి నాడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని శివుడు సంహరించాడు. ఈ సందర్భంగా దేవతలు స్వర్గంలో దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారని.. ఇప్పటికీ దేవతలు దీపాలను వెలిగిస్తారని భావిస్తారు. 

కార్తీక పౌర్ణమి దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది. శైవ, వైష్ణవ క్షేత్రాలు రెండింటా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలమీద, బియ్యం పిండితో చేసిన ప్రమీదలలో దీపాలు వెలిగిస్తారు. శివాలయాల్లో ధ్వజస్తంభం మీద, నందాదీపం పేరుతో అఖండదీపాన్ని, ఆకాశదీపం పేరుతో ఎత్త్తెన ప్రదేశాల్లో భరిణలతో (కుండలు, లోహపాత్రలతో తయారుచేసి) వేలాడదీస్తారు.

ప్రధానంగా కార్తీక పౌర్ణమినాడు తెల్లవారు జామున సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు తెల్లవారుజామునే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక వత్తి చొప్పున ఇవి ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి.

కార్తీక పౌర్ణమి రోజు నిర్వహించే మరో ముఖ్య ఘట్టం జ్వాలా తోరణం. సాయంకాలం వేళ శివాలయాల దగ్గర జ్వాలా తోరణం ఏర్పాటు చేస్తారు. శివపార్వతుల పల్లకిని ఈ జ్వాలా తోరణం కింద మూడు సార్లు అటూ ఇటూ తిప్పుతారు. దీన్ని దాటిన వారికి యమలోక శిక్షలు తప్పుతాయని భక్తుల విశ్వాసం.  

లక్ష్మీ పూజ.. సత్యనారాయణ వ్రతం..

హిందూ సంప్రదాయంలో సత్యనారాయణ వ్రతం చాలా విశిష్టమైంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏవైనా ముఖ్యమైన శుభకార్యాలు జరిగిన ప్రతి సందర్భంలో ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు. కొత్తగా వివాహమైన జంట, నూతన గృహ ప్రవేశం చేసినప్పుడు, వ్యాపార సంబంధిత నూతన కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు, విద్య, ఆరోగ్య, ఐశ్వర్యం, వ్యాపార వృద్ధి తదితర ఫలితాల కోసం ఈ వ్రతం జరుపుకొంటారు.

ఇక కార్తీక మాసంలోనూ సత్యనారాయణ వ్రతం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం, కేదారేశ్వర నోములు జరుపుకొంటారు. కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీ దేవిని పూజించే సంప్రదాయం కూడా ఉంది. శివకేశవులను కలిపి పూజించడానికి కూడా ఇది ప్రత్యేక రోజుగా చెబుతుంటారు. 

కార్తీక పౌర్ణమి తిథినాడు చేయాల్సినవి

కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామునే నిద్రలేచి వీలైతే నదీస్నానం ఆచరించాలి.  కుదరకపోతే ఇంట్లోనే సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఆలయాన్ని సందర్శించాలి.

కార్తీక పౌర్ణమి రోజున విష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. నదిలో దీపాలను దానం చేయండి. కుదరకపోతే ఆలయంలో దీపాన్ని దానం చేయండి.

విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శ్రేయస్కరం.

కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి పచ్చి పాలను నీటిలో కలిపి అర్ఘ్యం సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు.

ఆవును దానం చేయడం కూడా పుణ్యంగా భావిస్తారు.

పేదలకు ఆహారం, బెల్లం, దుస్తులు వంటి వాటిని దానం చేయడం శుభఫలితాలను అందిస్తుంది.

కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయకూడనివి

కార్తీక పౌర్ణమిని దేవ దీపావళిగా భావిస్తారు కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఇంటిని చీకటిగా ఉంచకూడదు. తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి. 

కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం శ్రేయస్కరం. కుదరని పక్షంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహరం తీసుకోవడం అరిష్టంగా భావిస్తారు.

కార్తీక పౌర్ణమి రోజున వెండి పాత్రలు లేదా పాలను దానం చేయకూడదు.  

ఇంటి ముందుకు వచ్చిన పేదలు, బిక్షాటన చేసే వారిని ఖాళీ చేతులతో  పంపించకూడదు. శక్తి మేరకు ఆహారాన్ని, ధనాన్ని లేదా ధ్యాన్యాన్ని దానం చేయాలి.

కార్తీక పౌర్ణమి నాడు అత్యంత పవిత్రంగా వీటిని అనుసరిస్తే భక్తులకు శివకేశవుల దీవెనలు, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక వృద్ధి లభిస్తుందని విశ్వాసం.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions