Shefali Jariwala passes away at 42 | 2002లో విడుదలైన ‘కాంటా లగా’ రీమిక్స్ సాంగ్ తో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయారు నటి షఫాలీ జరివాలా. అయితే ఆమె శుక్రవారం రాత్రి మృతి చెందారు.
శుక్రవారం రాత్రి షఫాలీ అస్వస్థతకు గురయ్యారు. దింతో ఆమెను భర్త పరాగ్ త్యాగి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తొలుత షఫాలీ కార్డియాక్ అరెస్టుతో మృతి చెందినట్లు కథనాలు వచ్చాయి.
కానీ ముంబయి పోలీసులు మాత్రం ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. ముంబయి అంధేరిలోని నివాసంలో షఫాలీ మృతదేహాన్ని పరిశీలించినట్లు, పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించినట్లు వెల్లడించారు.
ఇదే సమయంలో ఆమె అపార్టుమెంట్ ను ఫారెన్సిక్ నిపుణులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పోలీసులు కూడా సోదాలు చేపట్టారు. అలాగే వంట మనిషి, ఇంట్లో పనిచేసే వారిని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె మృతిని అనుమానాస్పదంగానే పరిగణలోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ముంబయి పోలీసులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా షఫాలీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ లో పాల్గొన్నారు. ఇకపోతే మొదట మ్యూజీషియన్ హర్మీత్ సింగ్ ను పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత వీరు విడిపోయారు. ఆ తర్వాత యాక్టర్ పరాగ్ త్యాగిని పెళ్లిచేసుకున్నారు.