school headmaster took self punishment after fails to control students | క్రమశిక్షణ తప్పిన విద్యార్థులను దండించకుండా వారిలో మార్పును తీసుకురావాలని ఓ పాఠశాల హెడ్ మాస్టర్ స్వయంగా తానే గుంజీలు తీశారు.
హెడ్ మాస్టర్ గుంజీలు తీస్తుంటే విద్యార్థులు వద్దు సార్ అంటూ వేడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఘటన విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పెంట జెడ్పీ హైస్కూల్ లో చోటుచేసుకుంది.
ఈ ఘటనపై పట్ల మంత్రి నారా లోకేష్ సైతం స్పందించారు. పిల్లల విద్యా పురోగతి అంతంతమాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదని….విద్యార్థులను దండించకుండా, హెడ్మాస్టర్ చింత రమణ గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు.
అంతా కలిసి పనిచేసి, ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. విద్యార్థులను దండించకుండా అర్థం చేసుకునేలా హెడ్ మాస్టర్ స్వీయక్రమశిక్షణ చర్య ఆలోచన బాగుందని లోకేశ్ అభినందించారు.
అందరం కలిసి విద్యాప్రమాణాలు పెంచుదామని పిలుపునిచ్చారు. పిల్లల విద్య, శారీరక, మానసిక వికాసానికి కృషిచేసి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని స్పష్టం చేశారు.