Saying I Love You is not a crime | ఒక యువతికి ఐ లవ్ యూ అని చెప్పడం లైంగిక వేధింపుల నేరం కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి లైంగిక ఉద్దేశం లేకుండా ఐ లవ్ యూ అనే మాటను వేధింపులుగా పరిగణించలేమని తెలిపింది. “ఐ లవ్ యు” వంటి పదాలు మాత్రమే లైంగిక ఉద్దేశాన్ని సూచించవని నాగ్‌పూర్ బెంచ్‌కు చెందిన జస్టిస్ ఊర్మిళా జోషి-ఫాల్కే ధర్మాసనం పేర్కొంది.
వివరాల్లోకి వెళితే 2015లో 35 ఏళ్ల వ్యక్తి 17 ఏళ్ల యువతికి ఐ లవ్ యూ అని చెప్పాడు. దీంతో ఆ యువతి తన తండ్రికి చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించగా ఆ వ్యక్తి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 2017లో సెషన్స్ కోర్టు ఆ వ్యక్తిని ఐపీసీ మరియు పోక్సో చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం దోషిగా నిర్ధారించి , అతనికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
అయితే నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు సెషన్స్ కోర్టు తీర్పును రద్దు చేస్తూ.. ఐ లవ్ యూ అనే మాటలను నేరంగా పరిగణించలేమంది. నిందితుడి చర్యలు లైంగిక వేధింపుల చట్టపరమైన నిర్వచనానికి అనుగుణంగా లేవని హైకోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసులో, లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకునే లక్ష్యంతో నిందితుడు “ఐ లవ్ యూ” అని చెప్పాడని సూచించే ఎలాంటి ఆధారాలు హైకోర్టుకు దొరకలేదు. అలాంటి ఉద్దేశ్యం లేకుండా, POCSO చట్టం మరియు లైంగిక వేధింపుల కింద నేరం నిలబడదని కోర్టు పేర్కొంటూ నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది.