Rajasthan Man’s Cross-Border Wedding With Pakistani Bride Halted After Attari Border Closure | జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇందులో భాగంగ అట్టారీ సరిహద్దును ఆర్మీ మూసివేసింది. ఈ పరిణామ ప్రభావం ఓ యువకుడి పెళ్లిపై పడింది. వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్ బాడ్మేర్ జిల్లాకు చెందిన షైతాన్ సింగ్ కు పాకిస్థాన్ సింధు ప్రావిన్స్ కు చెందిన కేసర్ కన్వర్ తో సుమారు నాలుగేళ్ళ క్రితం వివాహం నిశ్చయం అయ్యింది. అలాగే నిశ్చితార్థం కూడా జరిగింది.
పాక్ లోని సింధ్ ప్రావిన్స్ లో సోధా రాజపుత్ సామాజిక వర్గ జనాభా ఎక్కువ. వీరికి రాజస్థాన్ లోని రాజపుత్ లతో వివాహాలు జరిపించడం చాలా ఏళ్లుగా కొనసాగుతుంది. సింధ్ ప్రావిన్సులోని సోధా రాజపుత్ యువతులు రాజస్థాన్ లోని సోధా రాజపుత్ యువకులను వివాహం చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతారు.
ఇందులో భాగంగానే సింగ్-కన్వర్ కు పెళ్లి ఖాయమయ్యింది. చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత షైతాన్ సింగ్ కు మరియు ఆయన కుటుంబ సభ్యులకు పాకిస్థాన్ ఫిబ్రవరి 18న వీసా మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30న పెళ్లి జరగనుంది. పెళ్లి కోసం సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి బరాత్ గా పాక్ వెళ్లేందుకు అట్టారీ బార్డర్ వద్దకు చేరుకున్నారు.
కానీ, పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం సరిహద్దును మూసివేసింది. దింతో కుటుంబ సభ్యులు నిరాశకు లోనయ్యారు. అయితే దేశమే ముఖ్యమని ఆ తర్వాతే తన వివాహం అని వరుడు షైతాన్ సింగ్ పేర్కొన్నాడు.
మే 12 వరకే వీసాల గడువు ఉందని, అప్పటిలోగా సరిహద్దు తెరిస్తే బాగుంటుందని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వివాహం కోసం పాక్ నుండి కుటుంబ సభ్యులు వచ్చారని, వారు తిరిగి వెళ్ళాల్సి ఉందన్నారు.