Minimum Balance Fine | బ్యాంకు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ (Minimum Balance) నిర్వహించలేదనే నెపంతో ప్రైవేట్ రంగ బ్యాంకులు సామాన్యుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ప్రైవేట్ బ్యాంకులు ఏకంగా ₹11,000 కోట్లను జరిమానాల రూపంలో వసూలు చేశాయి.
ఇదే సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వసూలు చేసిన మొత్తం ₹8,000 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ లోక్సభలో వెల్లడించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం, అత్యధికంగా వసూలు చేసిన బ్యాంకుల్లో 3,800 కోట్ల రూ.లతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అగ్రస్థానంలో ఉంది.
ఆ తర్వాత యాక్సిస్ బ్యాంక్ రూ. 2700 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ. ₹1,200 కోట్లు వసూలు చేశాయి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) అత్యధికంగా ₹1,500 కోట్లు వసూలు చేయగా, బ్యాంక్ ఆఫ్ బరోడా ₹1,200 కోట్లు, ఇండియన్ బ్యాంక్ ₹1,100 కోట్లు వసూలు చేశాయి.
కాగా, దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2020 మార్చి నుండే సేవింగ్స్ ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ జరిమానాలను పూర్తిగా రద్దు చేసింది. దాని బాటలోనే గత ఏడాది పీఎన్బీ, కెనరా బ్యాంకులు కూడా పొదుపు ఖాతాదారులకు ఈ భారం నుండి ఉపశమనం కలిగించాయి. అయితే, ప్రైవేట్ బ్యాంకులు మాత్రం ఇప్పటికీ భారీగా చార్జీలు వసూలు చేస్తూనే ఉండటం గమనార్హం.






