President to Visit Hyderabad | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) జులై 4 వ తేదీన హైదరాబాద్ లో పర్యటించారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanti Kumari) కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
డా.బీఆర్ అంబెడ్కర్ సచివాలయంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సోమవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటుచేశారు.
డీజీపీ అంజనీ కుమార్ తోపాటు పలు శాఖల ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో సి.ఎస్ మాట్లాడుతూ, జులై 4 సాయంత్రం అల్లూరి సీతారామరాజు 125 వ జన్మదినం ఉత్సవాలలో పాల్గొంటారని తెలిపారు.
రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జరిగే మార్గాలలో రోడ్ల మరమ్మతులు, బారికేడింగ్ చేపట్టాలని కోరారు.
ఈ పర్యటన సందర్భంగా విస్తృత బందోబస్తు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య బృందాలను నియమించడం, తగు పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.
ప్రోటోకాల్ ను అనుసరించి ఏవిధమైన లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలని సి.ఎస్ కోరారు.