- హస్తం పార్టీలోకే బీఆరెఎస్ బహిష్కృత నేతలు
- పొంగులేటి ఇంటికి రేవంత్, కోమటిరెడ్డి
- పార్టీలో చేరికపై స్పష్టత వచ్చే అవకాశం
- బీజేపీ ఆశలపై నీళ్లు!
Ponguleti Srinivas Reddy | భారత రాష్ట్ర సమితి పార్టీని (BRS Paty) విభేదించి, ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.
ఇన్నాళ్లుగా ఇరువురూ ఏ పార్టీలో చేరబోతున్నారో అని తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా సాగిన ఉత్కంఠకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి.
కార్యకర్తల అభిప్రాయాలు, వారి నియోజకవర్గాల్లో వివిధ పార్టీల బలాబలాలు తదితర అనేక సమీకరణాలపై తర్జనభర్జనలు పడిన జూపల్లి, పొంగులేటి చివరికి హస్తం పార్టీవైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఇరువురూ వారి ప్రాంతాలో చాలా రోజుల పాటు సర్వేలు చేయించుకొని, కార్యకర్తలతో చర్చించి కాంగ్రెస్ పార్టీ లోకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పైగా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) బుధవారం స్వయంగా పొంగులేటి ఇంటికి వెళ్లి చర్చించనున్నారు. ఆ చర్చల అనంతరం పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
బీఆరెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసుకున్న ఇద్దరూ నేతలనూ తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) విశ్వప్రయత్నాలు చేశాయి. వారి ప్రాంతాల్లో ఇద్దరూ బలమైన నాయకులు కావడం, ఇతర నియోజకవర్గాలను కూడా ప్రభావితం చేయగలిగే వారు కావడంతో ఇద్దరిపై రెండు పార్టీలు చాలా ఆసక్తి కనబరిచాయి.
ముఖ్యoగా పొంగులేటి కేవలం ఆయన పోటీ చేసే స్థానమే కాకుండా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఖమ్మం లోని 10 నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలిగే సత్తా ఉన్న లీడర్ ఆయన. దానికి తోడు బలమైన ఆర్థిక వనరులు ఉన్న నేత కావటం వలన పొంగులేటి పైన అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి.
బీఆరెస్ లో వీరిద్దరూ ఎప్పటి నుండో అసంతృప్తి గా ఉన్నప్పటికీ బీఆరెస్ అధిష్టానం చాలా రోజుల తర్వాత వీరిద్దరిని పార్టీ నుండి బహిష్కరించింది. అప్పటి నుండి పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో సభలు పెట్టి బీఆరెస్ పార్టీ కి వ్యతిరేకంగా నాయకులను, కార్యకర్తలను సమీకరించే ప్రయత్నం చేశారు. ఒక విధంగా అందులో సక్సెస్ కూడా అయినట్లు స్పష్టమవుతోంది.
ప్రయత్నించి విఫలమైన బీజేపీ..
తెలంగానలో బీఆరెస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకొంటున్న బీజేపీ.. ప్రజాకర్షణ ఉన్న పొంగులేటి, జూపల్లిని చేర్చుకోవడానికి గట్టిగా ప్రయత్నించింది. తెలంగాణ బీజేపీలో చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ వారు ఇద్దరితో చర్చలు జరిపారు కూడా. అయినప్పటికీ వారు ఇరువరూ బీజేపీ ఆహ్వానాన్ని తిరస్కరించారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకి వచ్చనిప్పటి నుంచి ఇద్దరు నాయకులు కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నట్లు కనిపించింది. కానీ బహిరంగంగా బయటపడలేదు. చివరికి వీరిద్దరిని కాంగ్రెస్ లోకి రప్పించటానికి పార్టీ రాష్ట్ర నాయకత్వం చర్చలు జరిపింది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి కూడా వీరిని పార్టీ లోకి రావాలని బహిరంగంగా ఆహ్వానించారు.
ఇది ఇలా ఉండగా రాహుల్ గాంధీ టీం కూడా నేరుగా రంగం లోకి దిగి పొంగులేటి, జూపల్లితో చర్చలు జరిపినట్లు సమాచారం. దీంతో ఎట్టకేలకు హస్తంగూటికే చేరుతున్నట్లు స్పష్టత వచ్చింది.
కాంగ్రెస్ పార్టీకే ఆధిక్యం.. కానీ..
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే అందులో భట్టి విక్రమార్క మినహా మిగిలిన వారంతా బీఆరెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పటికీ, పార్టీ కేడర్ మాత్రం కాంగ్రెస్ వైపే బలంగా ఉందని గుర్తించిన పొంగులేటి హస్తం పార్టీలోనే చేరడానికి మొగ్గుచూపుతున్నట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇదే తోవలో జూపల్లి కూడా తన నియోజకవర్గంలో బీఆరెస్ ను ఎదుర్కునే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని గమనించారు. దీంతో ఆయన కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఇరువురు నేతలు కాంగ్రెస్ లో చేరితే పార్టీకి కాస్త ఊపు రావడం ఖాయం. పొంగులేటితోపాటు బీఆరెస్ లో అసంతృప్త నేతలు మరికొందరు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. కేవలం ఖమ్మం నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లోని కొంతమంది యువ నాయకులు కూడా పొంగులేటి వెంట కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
పొంగులేటి చేరికతో కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరడం అటుంచితే, అసలే అధిపత్య పోరుకు పెట్టింది పేరైన పార్టీలో భట్టి విక్రమార్క, రేణుక చౌదరి లాంటి బలమైన నాయకులతో పొంగులేటి ఏ విధంగా కలసి వెళతారో చూడాలి.