PM Narendra Modi’s warning to Pahalgam terrorists | ఉగ్రవాదులకు వారికి పహల్గాం ఉగ్రదాడి వెనుక ఉన్నవారిని వదిలేదే లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు.
ఎక్కడ నక్కినా వెతికి మరీ శిక్షిస్తామని కుండబద్దలు కొట్టారు. జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఘటనపై ప్రధాని తొలిసారి బహిరంగంగా మాట్లాడారు.
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్ మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ముందుగా పహల్గాం మృతులకు ప్రధాని నివాళులర్పించారు. అనంతరం సభలోని వారు ఒక నిమిషం పాటు మౌనం వహించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ యావత్ దేశం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇది కేవలం పర్యాటకులపై చేసిన దాడి మాత్రమే కాదు, భారత ఆత్మపై శత్రువులు చేసిన దాడి అని పేర్కొన్నారు. అయినప్పటికీ భారతదేశ ఆత్మను బలహీన పరచలేరని స్పష్టం చేశారు. భారత్ ఐక్యంగా నిలబడి, ఈ దుష్టశక్తులను ఎదుర్కొంటుందని పేర్కొన్నారు.
ఈ దాడి వెనుక ఉన్న శక్తులు ఎవరో తెలుసన్నారు. ‘భారతదేశం ఒక్క ఉగ్రవాదినీ వదిలిపెట్టదు. ఉగ్రవాది ఎవరైనా, ఎక్కడ ఉన్నా గుర్తిస్తాం, ట్రాక్ చేస్తాం, ఊహించని విధంగా శిక్షిస్తాం. భూమిపై ఎక్కడికి వెళ్లినా, మీరు తప్పించుకోలేరు’ అని ప్రధాని వార్నింగ్ ఇచ్చారు.
పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి అనంతరం ఇండస్ వాటర్ ఒప్పందాన్ని రద్దు చేయడం, అట్టారీ-వాఘా సరిహద్దును మూసివేయడం, పాకిస్థాన్ దౌత్యవేత్తలను వెళ్లగొట్టడం వంటి చర్యలను చేపట్టినట్లు చెప్పారు. ఈ దాడికి బాధ్యులైన వారిని శిక్షించే వరకు ఆగేదే లేదన్నారు. ఈ సందర్భంగా భారత్ కు అండగా నిలిచిన దేశాలకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.