PM Modi Independent Speech | ఢిల్లీ ఎర్రకోట (Red Fort) వేదికగా ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వతంత్ర భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తి దాయకమన్నారు.
దేశం కోసం పోరాడిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకుందామని పిలుపునిచ్చారు. ప్రాణాలను అర్పించిన మహనీయులకు దేశం రుణపడి ఉంటుందన్నారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్లాలనీ, భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా తీర్చిదిద్దాలని సూచించారు.
వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అభివృద్ధి పథంలో ముందుకెళుతున్నామని చెప్పారు. 40 కోట్ల మంది స్వాతంత్య్రాన్ని సాధిస్తే.. 140 కోట్ల మంది ఇంకేమైనా సాధించవచ్చన్నారు.
దేశ ప్రజల సంకల్పంతో 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చగలమని ఆకాంక్షించారు. తమ ప్రభుత్వం వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ఇచ్చిందనీ, ఇది ఆర్ధిక వ్యవస్థకు కొత్త మంత్రమని పేర్కొన్నారు. ఉపాధి కల్పనలో గణనీయమైన పురోగతి సాధించామని చెప్పారు.
భారత్ అతి త్వరలోనే మూడో ప్రపంచ ఆర్ధిక శక్తిగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో కోటి మంది మహిళలను లక్షాధికారులుగా మారుస్తామన్నారు. ‘నేషన్ ఫస్ట్.. రాష్ట్ర హిత్ సుప్రీం’ సంకల్పంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. యువతకు అపార అవకాశాలున్నాయన్నారు.
అంతరిక్ష రంగంలో భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోందని మోది పేర్కొన్నారు. గత పదేళ్లలో లక్ష మెడికల్ సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చామని.. మరో 75 వేల సీట్లను పెంచుతామని హామీ ఇచ్చారు. సేంద్రీయ వ్యవసాయాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందనీ, ప్రపంచానికి సేంద్రీయ వ్యవసాయాన్ని పరిచయం చేస్తామని చెప్పారు.