PM Modi inaugurates India’s first vertical lift sea bridge | తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో నిర్మించిన పంబన్ బ్రిడ్జిని శ్రీరామనవమి సందర్భంగా జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. శ్రీలంక పర్యటన అనంతరం ప్రధాని ఈ బ్రిడ్జిని ప్రారంభించారు.
తమిళనాడులోని రామేశ్వరంను భారత ప్రధాన భూభాగంతో ఈ బ్రిడ్జి అనుసంధానం చేయనుంది. దీనిని జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. పంబన్ బ్రిడ్జి 2.08 కి.మీ. పొడవుతో దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ సముద్ర వంతెనగా నిలిచింది.
బ్రిడ్జి దిగువన ఓడల రాకపోకలకు ఈ వర్టికల్ లిఫ్ట్ ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రామేశ్వరం-తాంబరం ఎక్స్ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అలాగే వంతెన కింద నుండి కోస్ట్ గార్డ్ ఓడను కూడా ఆరంభించారు.
ఈ వంతెనలోని 72.5 మీటర్ల వర్టికల్ లిఫ్ట్ 17 మీటర్ల ఎత్తుకు వెళ్లి ఓడల రాకపోకలకు అనుమతినిస్తుంది. 2019 మార్చి 1న ప్రధాని ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా, 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పనులు చేపట్టి, నాలుగేళ్లలో పూర్తి చేసింది.