Pitapuram News Latest | పిఠాపురం నియోజకవర్గంలో దళితులను గ్రామ బహిష్కరణ చేశారంటూ వస్తున్న కథనాలు కలకలం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే పిఠాపురం మండలం మల్లం గ్రామంలో దళితుల సామాజిక బహిష్కరణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
గ్రామంలోని దుకాణాలు, హోటళ్ల యజమానులు దళితులకు ఎటువంటి వస్తువుల్ని విక్రయించకూడదని గ్రామంలోని అగ్రవర్ణాల పెద్దలు తీర్మానం చేశారు. ఏప్రిల్ 16న అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి ఇంటివద్ద కరెంట్ పని చేస్తూ విద్యుత్ ఘాతానికి గురై పల్లపు సురేషన్ వ్యక్తి మృతిచెందారు.
ఈ నేపథ్యంలో గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అతని కుటుంబ సభ్యులు న్యాయం జరగాలంటూ నిరసనకు దిగారు. ఈ తరుణంలో రూ.2 లక్షల 75 వేల నష్టపరిహారం చెల్లించడానికి ఒప్పుకున్నారు. అయితే నష్టపరిహారం విషయం పక్కనపెట్టి తప్పు లేకున్నా దళితులు తమ నుండి నష్టపరిహారం అడగడం ఏంటని భావించిన అగ్రవర్ణాల పెద్దలు గ్రామ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో గ్రామంలోని వ్యాపారస్తులు దళితులకు ఎటువంటి వస్తువుల్ని విక్రయించడం లేదు, అలాగే పనులకు వెళ్లినా రానివ్వడం లేదు.









