PC Ghose’s Commission Report To Be Tabled In Telangana Assembly | కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో న్యాయ విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర మంత్రిమండలి యధాతథంగా ఆమోదించినట్టు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మొత్తం మంత్రివర్గ సహచరులతో కలిసి ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.
జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను మంత్రిమండలి ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో దాన్ని శాసనసభ, శాసనమండలి ముందు పెట్టి స్వేచ్ఛగా అన్ని పక్షాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ మూడు బ్యారేజీల నిర్మాణం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకైక నిర్ణయం అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమే అవసరం లేదని అప్పట్లోనే నిపుణుల కమిటీ నివేదించగా, ఉద్దేశపూర్వకంగా ఆ నివేదికను తొక్కిపెట్టారని తెలిపారు.









