Pawan Kalyan questions Lulu Mall’s processing unit near Vijayawada | ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, విజయవాడలో లూలు గ్రూప్ పలు మాల్స్ మరియు సంస్థలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందాలు సైతం కుదిరాయి.
ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికే తమ అవసరం ఉన్నట్లుగా లూలు వ్యవహరిస్తోందని అతి షరతులు విధిస్తోందని అసహనం వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరిగింది. ఇందులో లూలు సంస్థకు భూ కేటాయింపులకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. కృష్ణా జిల్లా మల్లవల్లి మెగా ఫుడ్ పార్కులో లూలు గ్రూప్ కు 7.48 ఎకరాలను కోర్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకు లీజుకు ఇవ్వాలనే ప్రతిపాదన అంశం చర్చకు వచ్చింది.
ఈ సందర్భంగా పవన్ అధికారులకు పలు ప్రశ్నలు సంధించారు. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే అక్కడ ఏమి చేస్తారు అని ఆయన అడిగారు. కబేళాను నిర్వహించి గోవధ చేస్తారా ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవధ చేసి ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తారా అని అధికారులను సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ ఇదే జరిగితే ఉపేక్షించేదే లేదని తేల్చి చెప్పారు. గోవధకు తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు లీజుకు తీసుకుంటూ లూలు సంస్థ ప్రభుత్వానికే కండీషన్లు పెడుతుందని మండిపడ్డారు. అలాగే లూలు ఏర్పాటు చేయబోయే మాల్స్ ఇతర సంస్థల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.









