Pastor Praveen Pagadala Death | రాజమండ్రి శివారులో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. కానీ పాస్టర్ మృతిపై క్రిస్టియన్ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవ సంఘాలు రాజమండ్రి జీజీహెచ్ ముందు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. పాస్టర్ మృతిపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు.
ఈ మేరకు రాష్ట్ర డీజీపీతో మాట్లాడారు. అలాగే వివిధ సంఘాలు పాస్టర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తామని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. రాజమండ్రి వద్ద కొంతమూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతిచెందారని రాజానగరం సీఐ మీడియాకు తెలిపారు.
హైదరాబాద్ నుండి బుల్లెట్ పై సోమవారం బయలుదేరిన పాస్టర్ అర్ధరాత్రి కొంతమూరు వద్ద ప్రమాదానికి గురయ్యారని పేర్కొన్నారు. పాస్టర్ హైవే కిందకు పడిపోగా, ఆయన పై బైక్ పడిపోవడంతో తీవ్ర గాయాలు అయినట్లు వివరించారు.