Pastor Praveen Death News | పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఐజి అశోక్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ పలుమార్లు మద్యం సేవించినట్లు విచారణలో తేలిందని తెలిపారు.
అంతేకాకుండా అతివేగం కూడా ప్రమాదానికి కారణమని స్పష్టం చేశారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణంలో ఎలాంటి అనుమానాలు లేవని ఆయన రోడ్డు ప్రమాదంలోనే మరణించారని పేర్కొన్నారు. ఈ మేరకు పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించిన కేసు పూర్తి వివరాలను రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశం ద్వారా ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు.
మార్చి 24న ప్రవీణ్ హైదరాబాద్ నుండి విజయవాడ మీదుగా రాజమండ్రి బయలుదేరారు. అయితే రాజమండ్రి సమీపంలో ఆయన మరణించిన విషయం తెల్సిందే. కానీ పాస్టర్ మృతి పట్ల క్రిస్టియన్ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో పోలీసులు పూర్తిస్తాయి దర్యాప్తు చేపట్టారు.
ప్రవీణ్ మృతికి సంబంధించి కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని, పోలీసుల దర్యాప్తు పై విశ్వాసం వ్యక్తం చేసినట్లు ఐజి వివరించారు. హైదరాబాద్, కోదాడ, ఏలూరు లో ప్రవీణ్ మద్యం షాపులకు వెళ్లారని అలాగే మార్గ మధ్యలో ఆయన మూడు సార్లు స్వల్ప రోడ్డు ప్రమాదాలకు గురయినట్లు చెప్పారు.
ప్రవీణ్ శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని పోస్టుమార్టం రిపోర్టులో కూడా వెల్లడైందన్నారు. రాజమండ్రి సమీపంలో ప్రవీణ్ యాక్సిడెంట్ కు గురయ్యారని, అయితే బుల్లెట్ బండి ఎగిరి పాస్టర్ పై పడినట్లు ఫోరెన్సిక్ నివేదికలో స్పష్టమయ్యిందని ఐజీ పేర్కొన్నారు. అంతేకాని మరే ఇతర వాహనం ఢీ కొట్టలేదని చెప్పారు.