Pakistan Appeals To India: Reconsider Holding Indus Water Treaty | సింధూ జలాలపై భారత ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునః సమీక్షించాలని దాయాధి పాకిస్థాన్ కోరింది.
ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి బుధవారం లేఖను రాసింది. జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాది అనంతరం భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై పలు దౌత్యపరమయిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా 1960లో కుదుర్చుకున్న సింధూ జలాల ఒప్పందాన్ని కేంద్రం నిలిపివేసింది.
అయితే తొలుత భారత నిర్ణయంపై తీవ్ర స్వరంతో మాట్లాడిన పాక్ కు ఇప్పుడు తత్వం బోధపడింది. పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి భారత జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. లేఖలో పాకిస్తాన్ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.
సింధూ జలాల ఒప్పందం నిలిపివేత వల్ల తాగునీరు, వ్యవసాయ అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ ఒప్పందాన్ని కొనసాగించేలా భారత్ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని పాక్ విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో చర్చించేందుకు పాక్ సిద్ధంగా ఉన్నట్లు లేఖలో వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.
అదేవిధంగా, సలాల్ మరియు బాగ్లీహార్ జలవిద్యుత్ ప్రాజెక్టుల గేట్లను మూసివేసింది. దింతో పాకిస్తాన్ ఆర్థిక, వ్యవసాయ రంగాల్లో తీవ్ర ప్రభావం పడింది. ఎందుకంటే ఆ దేశం తన నీటి అవసరాలలో దాదాపు 80% సింధూ నదీ వ్యవస్థపై ఆధారపడి ఉంది.
మరోవైపు రక్తం, నీరు ఒకేసారి ప్రవహించవని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పాక్ తో చర్చలు అంటే కేవలం ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్ పైనే అని కుండ బద్దలు కొట్టారు. అలాగే భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నంత వరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని స్పష్టం చేశారు.









